
ప్రజాశక్తి-సోమందేపల్లి : కుల వివక్షతో చాకర్లపల్లి గ్రామ భూస్వామ్య పెత్తందారులు మూకుమ్మడి గా దళితుల మీద దాడి చేయడం హేయమైన సిగ్గుమాలిన చర్య అని ఈ ఘటనలో దళితులకు రక్షణ కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమందేపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాత హై స్కూల్ ఆవరణంలో మానవ హక్కుల , దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు , కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గంగాధర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మానవ హక్కుల , దళిత సంఘా నాయకులు మాట్లాడుతూ ఈ దాడి వెనుక రెడ్డి సామజిక వర్గంలోని కొంతమంది రాజకీయ కుల దురహంకారుల కుట్ర బలంగా ఉందని ఆరోపించారు. దాడికి గురైన దళితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అని అనుమానం వ్క్తం చేశారు. పోలీసులు చిత్తశుద్ధి గా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కిరాణా షాపుల్లో సరుకులు ఇవ్వకూడదని , వ్యవసాయ పనులకు పిలవకూడదని గ్రామంలో అనుకుంటున్నారని బాధిత దళితులు రౌండ్‌టేబుల్ సమావేశం వద్ద కన్నీరు మున్నీరు అయ్యారు. వారం రోజులు నుంచి ఇంత జరుగుతున్నా తహశీల్దార్ గ్రామాన్ని సందర్శించకపోవడం , అవగాహన సభ నిర్వహించక పోవడం చూస్తుంటే పాలకులకు దళితుల పట్ల ఎలాంటి వైఖరి ఉందో అర్థం అవుతోందని దళిత సంఘాలు ప్రశ్నించాయి. బాధితులకు న్యాయం జరిగే వరకు అవసరం అయితే న్యాయ పోరాటానికి వెళ్తామని అన్నారు. పోరాటంలో భాగంగా అక్టోబర్ 3 వ తేదీన నిందితులను అరెస్ట్ చేయాలని అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతామని చెప్పారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న , కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు హనుమయ్య , రమణ, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశులు , ఎస్సీ , ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నరసింహమూర్తి, మాజీ సర్పంచి హనుమంతప్ప, మానవ హక్కుల సంఘం నియోజకవర్గ కన్వీనర్ నరసింహమూర్తి , సమాచార హక్కు చట్టం సభ్యులు ముస్తఫా , ఇండియన్ లేబర్ పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ , వైసిపి ఎస్సీ సెల్ ఈశ్వర్ , దళిత గిరిజన ఐక్య వేదిక లీగల్ అడ్వైజర్ ఈశ్వర్, సిపిఎం వడ్డే రంగప్ప , జై భీమ్ భారత్ పార్టీ నియోజకవర్గం కన్వీనర్ ఊటుకూరు నాగరాజు, జనసేన పార్టీ నాగరాజు , ఆవాజ్ మండల కార్యదర్శి మాబు, ఎంఆర్‌పిఎస్ రంగేపల్లి కదిరిప్ప , బాధితులు, చాకర్లపల్లి గ్రామ దళితులు పాల్గొన్నారు.