Aug 14,2023 22:41

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల వద్ద సెల్ఫీ దిగుతున్న నారా లోకేష్‌

ప్రజాశక్తి-తాడికొండ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం తాడికొండ మండలంలో కొనసాగింది. రావెల, పొన్నెకల్లు, తాడికొండ అడ్డరోడ్డు, తాడికొండ, కంతేరు మీదుగా మంగళగిరి మండలం నిడమర్రుకు చేరుకుంది. తాడికొండ విడిది కేంద్రం వద్ద ఆడిటర్లతో నిర్వహించిన ముఖాముఖి అనంతరం తాడికొండ గ్రామస్తులు లోకేష్‌ను కలిసి సమస్యలను వివరించారు. తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హరిశ్చంద్రపురం నుండి కృష్ణానీళ్లు తాగునీరుగా వస్తున్నా సరిగా అందడం లేదని చెప్పారు. మూడు నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయన్నారు. వర్షం వస్తే మురుగునీరు రోడ్లపైనే నీరు నిలుస్తోందని, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీని ఏర్పాటు చేయాలని కోరారు. లోకేష్‌ మాట్లాడుతూ కృష్ణానది చెంతనే ఉన్నా తాగునీటి సమస్యలు దురదృష్టకరమన్నారు. ప్రజలకు గుక్కుడు నీళ్లు అందించలేని చేతగాని ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యమన్నారు. దళితులపై వైఎస్‌ జగన్‌కు ఉన్నది కపట ప్రేమేనని వ్యాఖ్యానించారు. టిడిపి హయాంలో నిర్మించిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల వద్ద సెల్ఫీ దిగారు. గత టిడిపి ప్రభుత్వంలో దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం తాడికొండతోపాటు గుంటూరు జిల్లాలో మరో నాలుగు చోట్ల సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు నిర్మించామన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పేద దళిత విద్యార్థుల కోసం ఒక్క స్కూలూ నిర్మించిన దాఖలాలు లేవన్నారు. ఇదిలా ఉండగా పాదయాత్రలో సంఘీభావంగా వేలమంది మహిళలు, యువకులు పాల్గొన్నారు. దారిదొడవునా నీరాజనం పలికారు. లోకేష్‌తో కరచాలనం చేసేందుకు యువకులు, విద్యార్థులు పోటీపడ్డారు.
నేటి పాదయాత్ర వివరాలు
మధ్యాహ్నం 2 గంటలకు నిడమర్రు శివారు క్యాంప్‌ సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం. 2.45 గంటలకు నిడమర్రు సెంటర్‌లో పసుపు రైతులతో సమావేశం. 3.30 గంటలకు బేతపూడి బాపూజీనగర్‌లో స్థానికులతో మాటామంతి. సాయంత్రం 4 గంటలకు మంగళగిరి రైల్వేగేటు వద్ద మహిళలతో సమావేశం. 4.30 గంటలకు మంగళగిరి మార్క్కెట్‌ యార్డు వద్ద టిడ్కో లబ్ధిదారులతో భేటీ. 4.40 గంటలకు పాతబస్టాండు వద్ద ముస్లిం సామాజికవర్గీయుులతో సమావేశం. 5.10 గంటలకు మున్సిపల్‌ ఆఫీసు వద్ద బీసీలతో సమావేశం. 5.25 గంటలకు ఆర్టీసీ బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతి. 5.55 గంటలకు నవుులూరు రోడ్డులో టూవీలర్స్‌ అసోసి యేషన్‌ ప్రతినిధులతో భేటీ. 6.25 గంటలకు యర్రబాలెం డాన్‌ బాస్కో స్కూలు వద్ద విడిది కేంద్రంలో బస.