ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి నిత్యం అన్నిచోట్లా వివక్షకు గురవుతున్న దళితులకు ఆఖరి మజిలీ కోసం కూడా అవస్థలు తప్పడం లేదు. కేటాయించిన శ్మశాన వాటికలను సైతం ఆక్రమించుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో స్థలాలున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కన్పించడం లేదు. ప్రశ్నిస్తే దళితులపై దాడులకు దిగుతున్న ఉదంతాలున్నాయి. అధికారులకు పిర్యాదులు చేస్తున్నా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో చేసేదేమీ లేక దళితులు మృతదేహాలను రోడ్ల పక్కన, చెరువు గట్లపైనా ఖననం చేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న కాకినాడ సూర్య కళామందిరంలో సిపిఎం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి దళిత సదస్సులో ఈ సమస్యలపై చర్చించనున్నారు. జగ్గంపేట మండలం రామవరంలో కొత్త ఎస్‌సి కాలనీ ఏర్పడి 60 ఏళ్లు పూర్తవుతున్నా నేటికీ శ్మశాన వాటికకు దారి లేకపోవడంతో దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవస్థలు పడుతూ వరి పొలాల మధ్య నుంచి మతదేహాలను తరలించాల్సి వస్తుంది. అనేకసార్లు అధికారులు, గ్రామ పెద్దలకు సమస్యను తెలియజేసినా పట్టించుకోవడం లేదు. మోకాలి లోతులో నుంచి వెళ్లాలంటే అనేక కష్టాలు పడాల్సి వస్తుందని దళితులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని గ్రామానికి చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు జుత్తుక నాగేశ్వరరావు కోరుతున్నారు. తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ పరిధిలోని కొత్తూరు, రాఘవేంద్రపురం దళితుల స్మశాన స్థలం అనేకేళ్లు గా ఆక్రమణకు గురై ఉంది. ఉన్న కొద్ది స్థలానికి సరైన రోడ్డు సౌకర్యం లేక మతదేహాలను తీసుకువెళ్లాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు తెలిపారు. దీనిపై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసి నెల రోజులు కావస్తున్నా నేటికీ సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నారు. పటవల మెయిన్ గ్రామంలో దళితుల స్మశానంకు సరైన రోడ్డు, షెల్టర్ లేకపోవడంతో వర్షం కురిస్తే స్మశానం మొత్తం మునిగిపోతుంది. కోరింగ గ్రామపంచాయతీ కొత్త కోరింగలో దళితులు స్మశానం లోతట్టు ప్రాంతంలో ఉండడంతో మతదేహాలను పూడ్చడానికి నానా అవస్థలు పడుతున్నారు. గాడిమొగ పంచాయతీ బాబానగర్ దళితులకు గత 30 ఏళ్లుగా స్మశాన స్థలం లేక రోడ్డు పక్కనే పూడ్చుతున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు మృతదేహంతో రాస్తారోకో చేయగా తహశీల్దారు ఇటీవలే స్థలం చూపించారు. అయితే అధికారికంగా నేటికీ అప్పగించలేదు. దీంతో అక్కడ ఉన్న ఒక మెజారిటీ సామాజిక వర్గం దళితులను బెదిరిస్తూ దళిత కాలనీకి వచ్చే తాగునీటిని నిలుపుదల చేస్తున్నారు. జార్జిపేట ఎంఎల్‌కె నగర్ దళితులకు శ్మశాన స్థలం లేక దూరంగా ఉన్న నీలపల్లి తీసుకు వెళుతున్నారు. కాజులూరు మండలం కుయ్యేరులో దళితులకు శ్మశానానికి వెళ్లడానికి దారి లేక పక్క రైతు పొలం మీదుగా వెళుతున్నారు. కొంతకాలంగా ఆ పొలం రైతు అభ్యంతరం చెప్పడంతో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. కరప మండలం గొర్రిపూడిలో స్మశానానికి స్థలం లేక మురుగు కాలువ పక్కనే శవాలను పూడ్చి పెడుతున్నారు. నీటి ప్రవాహం ఎక్కువై ఆ ఉన్న కొద్ది భూమి కూడా కొట్టుకుపోయింది. దీనిపై స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదు చేసి రెండు నెలలు కావస్తున్న ఇప్పటికీ అధికారులు స్పందించలేదు. పిఠాపురం మండలం పి.తిమ్మాపురం ఎస్‌సి పేటకు స్మశాన స్థలం లేకపోవడంతో కాలువ గట్టునే పూడ్చి పెడుతున్నారు. ఇదే మండలం భోగాపురంలో చాలా తక్కువ స్థలం ఉంది. మృతదేహాలను ఒకదానిపై మరొకటి పూడ్చి పెడుతున్నారు. వరదలు వస్తున్నప్పుడు మృతదేహాలు కొట్టుకుని పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజపతిరాజపురం, జములపల్లిలో శ్మశాన స్థలం లేక రోడ్డు పక్కన, ఏలేరు గట్టున పూడ్చుటున్నారు. నర్సింగపురం శ్మశాన స్థలం చిన్నదిగా ఉండగా దానికి మార్గం కూడా లేదు. మంగితుర్తిలో అసలు శ్మశానమే లేక పోవడంతో గత్యంతరం లేక కాలువ గట్టున పూడ్చుతున్నారు. గొల్లప్రోలు మండలం వన్నెపూడి శ్మశానం ఉన్నా దారి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నగర పంచాయతీ గొల్లప్రోలులో శ్మశానం ఉన్నా ముంపునకు గురవుతోంది. యు.కొత్తపల్లి మండలం నాగులపల్లిలో దళితులకు శ్మశాన వాటికను కేటాయించకపోవడంతో రమణక్కపేట వెళ్లే మార్గంలో ఉన్న ఏటిగట్టు పక్కనే దహనం చేయాల్సి వస్తుంది. ఎండపల్లి శ్మశాన వాటికకు వెళ్లే మార్గం లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారు. శంఖవరం శ్మశాన వాటిక ఆక్రమణకు గురైంది. స్థానిక ఎమ్మెల్యే గ్రామంలోనే నివాసం ఉంటున్నా పట్టించుకోవడం లేదు. రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం దళిత శ్మశాన వాటిక సమీపంలో డంపింగ్ యార్డ్ ఉండడంతో అద్వానంగా మారింది. రౌతులపూడి దళిత శ్మశాన వాటిక రహదారి సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్నానాలు చేసేందుకు బోరు లేదు. ములగపూడి శ్మశాన వాటికలో అపరిశుభ్రత ఎక్కువగా ఉంది. ఎస్.అగ్రహారం శ్మశాన వాటిక వెళ్ళేందుకు రహదారి సక్రమంగా లేదు.










