Sep 28,2023 20:57

సభలో మాట్లాడుతున్న అధ్యాపకులు రామయ్య

పార్వతీపురంరూరల్‌: సమాజంలోని వేళ్లూనుకున్న కుల వివక్ష, అంధ విశ్వాసాల ఫలితంగా దళితులు అనుభవించిన దుర్భర పరిస్థితులకు అద్దం పట్టిన గుర్రం జాషువా రచనల అవసరం ఈరోజుకు కూడా ఉందని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు దేవరాపల్లి రామయ్య అన్నారు. గురువారం స్థానిక వేదాంత జూనియర్‌ కళాశాలలో స్నేహకళా సాహితి నిర్వహించిన గుర్రం జాషువా జయంతి సభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ రచయిత మల్లిపురం జగదీశ్‌ మాట్లాడుతూ గుర్రం జాషువా రచనలు ఈ సమాజాన్ని అభ్యుదయ మార్గంలో నడిపించిన కారణంగానే ఈరోజు దళితులు, గిరిజనుల జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ మురళీమోహనరావు మాట్లాడుతూ జాషువా సాహిత్యాన్ని నేటి విద్యార్థుల మనసులకు హత్తుకునేలా చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో స్నేహ కళా సాహితి వ్యవస్థాపకులు గంటేడ గౌరునాయుడు, చందనపల్లి గోపాలరావు, సిరికి స్వామినాయుడు,పక్కి రవీంద్రనాథ్‌,చింత అప్పలనాయుడు, కిమ్మి నవీన్‌, సి. హెచ్‌. సత్యనారాయణ, గంటేడ చిన్నంనాయుడు, సోమేశ్వరరావు, ఉత్తరావల్లి గోవిందరావు, దొడ్లంకి గణపతిరావు తదితరులు ప్రసంగించారు.