Oct 15,2023 21:43

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి మోడీ పాలనలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసఱావు అన్నారు. దళిత సమస్యల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతూ ఆదివారం కాకినాడ సూర్య కళామందిరంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర దళిత సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితుల సమస్యను ప్రతి ఒక్కరూ సామాజిక సమస్యగా చూడాలన్నారు. పదేళ్లలో మానవాభివద్ధిలో, పిల్లల సంరక్షణలో, చదువుల్లో, ప్రజలకు మెరుగైన వైద్యం, ఆరోగ్యం అందించడంలో దేశంలోనే మొదటి స్థానంలో కేరళ వామపక్ష ప్రభుత్వం నిలిచిందన్నారు. అలాంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. నిధులను దారి మళ్లించి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. గడచిన 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ నినాదం ఇవ్వడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్కపనీ చేయలేదన్నారు. కుల వివక్షను అంతం చేసినప్పుడే నిజమైన స్వచ్ఛభారత్‌ అని అన్నారు. నా ఎస్‌సిలు, నా బిసిలు అంటూ పదేపదే చెబుతున్న జగన్‌ కేంద్రంతో సంబంధం లేకుండా కుల గణన తక్షణం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకుండా ద్రోహం చేసిన బిజెపిని వైసిపి, టిడిపి, జనసేలను ఎందుకు బలపరుస్తున్నాయో చెప్పాలన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ దళితుల స్థితిగతులను తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు సిపిఎం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించిందన్నారు. ఓ పక్క కమ్యూనిస్టు ఉద్యమం, మరోవైపు అంబేద్కర్‌ ఉద్యమం రెండూ కలిసి దళితుల హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయన్నారు. దళితుల హక్కులను కాపాడకపోతే రాబోయే ఎన్నికల్లో వైసిపి, బిజెపిలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి, వైసిపి పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. అంబేద్కర్‌ పేరుతో ఉన్న పథకానికి ఎందుకు పేరు మార్చారన్నారు. దళితులు ఎదుర్కొంటున్న శ్మశానాల సమస్యను పరిష్కరించాలన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు మాట్లా డుతూ దళితులు ఓటు బ్యాంకుగానే నాయకులు చూడటం శోచనీయమన్నారు. అట్రాసిటీ కేసుల్లో దళితులకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. సిపిఎం రాష్ట్ర నల్లప్ప మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలన్నారు. సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు జి.బేబిరాణి మాట్లాడుతూ మోడీ, జగన్‌ వల్ల దళితులకు ఒరిగిందేమీ లేదన్నారు. సమస్యలపై పోరాటాలే శరణ్యం అన్నారు. దళిత నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలు దళితుల హక్కులు, చట్టాలను నీరుగారుస్తున్నాయన్నారు. ఐక్యంగా పోరాడి వీటిని సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు కెఎస్‌.శ్రీనివాస్‌, దువ్వా శేషబాబ్జి, కరణం ప్రసాదరావు, డాక్టర బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సిపిఎం కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు కె.సింహాచలం, సిహెచ్‌.రమణి, సిహెచ్‌.రాజ్‌కుమార్‌, ఎం.రమణ, ఎం.వి.రమణ, పి.వీరబాబు, పి.రామకృష్ణారావు, చంద్రావతి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శనలు ఆలోచింపజేశాయి.