ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు ఆగకపోగా పెరిగాయని దళితుల సమస్యలపై కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు సాగించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. కెవిపిఎస్ జిల్లా ప్రథమ మహాసభ కాకినాడ యుటిఎఫ్ హోమ్‌లో శనివారం బి.సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ దళిత చైతన్యం ఎక్కువగా ఉన్న కాకినాడ జిల్లాలో కూడా ఎక్కువగా దాడులు జరుగుతున్నాయన్నారు. వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. ఇటీవల ఎంఎల్‌సి అనంత ఉదయ భాస్కర్ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య దారుణమన్నారు. హత్య కేసులో నిందితునిగా ఉన్న ఉదయ భాస్కర్ జైలు నుంచి బెయిల్ పై వచ్చిన సందర్భంగా ఊరేగింపు నిర్వహించడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. తొండంగి మండలం శంగవక్షంలో దళితపేటపై దాడి చేసి దళితుని దారుణంగా హత్య చేశారన్నారు. పిఠాపురం మండలం మల్లంలో జాతర సందర్భంగా జరిగిన చిన్న సంఘటనలు దష్టిలో ఉంచుకుని అగ్రవర్ణాలకు చెందిన పలువురు ఎస్‌సి కాలనీపై దాడి చేసి దళితులను భయభ్రాంతులకు గురిచేసి దారుణంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎస్‌సి, ఎస్‌టి మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించడం లేదన్నారు. దళితులపై దాడులు దౌర్జన్యాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగాలకు దిశా నిర్దేశం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
జిల్లాలో నేటికీ చాలా గ్రామాలు, మున్సిపల్ పట్టణాల్లో దళిత కాలనీలకు శ్మశాన స్థలాలు లేవని, ఉన్నవి కూడా కొన్నిచోట్ల ఆక్రమణలకు గురయ్యాని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి రెండు బస్సు యాత్రలు కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
సీనియర్ దళిత నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా కుల వివక్షపై సర్వేలు చేసి జిల్లాల్లో వివిధ రూపాల్లో ఉన్న కుల వివక్ష పై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిన ఫలితంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పడిందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాను చట్టం కోసం కెవిపిఎస్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారని తెలిపారు. ఇటీవల మరణించిన కెవిపిఎస్ సీనియర్ నాయకుడు వసంత కుమార్ చిత్రపటానికి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మహాసభలో దళిత నాయకులు బచ్చల కామేశ్వరరావు, వడ్డి ఏడుకొండలు, ప్రజా సంఘాల నాయకులు ఎం.రాజశేఖర్, కెఎస్ శ్రీనివాస్, టి.ఈశ్వరరావు, సిహెచ్.అజరు కుమార్, జి.భాస్కర్, కెవిపిస్ నాయకులు కె.సింహాచలం, కె.లోవరాజు, విప్పర్తి శ్రీను, ఎన్.రాజు, వై.నాని బాబు, కెవి రమణ విచక్రధర్ రావు, కె.శివశంకర్, పులపకూరి కృష్ణ, గొల్లపల్లి ఏసు పాల్గొన్నారు.










