ప్రజాశక్తి-కాకినాడ జిల్లాలో దళితుల శ్మశాన సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కెవిపిఎస్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ దళిత నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి.ఈశ్వరరావు, కెఎస్.శ్రీనివాస్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె.సింహాచలం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల స్మశాన అభివద్ధికి 1235 జిఒ తెచ్చినప్పటికి జిల్లాలో ఎక్కడా అమలు కాలేదన్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో శ్మశాన స్థలాలు లేక, కొన్ని చోట్ల స్థలం ఉన్నా దారి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాళ్ళరేవు మండలం గాడిమొగ పంచాయతీ బాబా నగర్‌లో 50 ఏళ్లుగా శ్వశానం లేక దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చివరికి శవంతో ధర్నా చేసిన ఫలితంగా తహశీల్దారు స్థలం కేటాయించినా వేరే కులస్తులు అడ్డు చెప్తున్నారన్నారు. కరప మండలం గొర్రిపూడిలో దళితులకు శ్మశానం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాజులూరు మండలం కుయ్యేరులో శ్మశానం ఉన్నా దారి మార్గం లేకపోవడంతో పెద్ద సమస్యగా ఉందన్నారు.
శ్మశాన వాటిక ఏర్పాటులో అడ్డంకులు తగదు
తాళ్లరేవు : కొన్నేళ్లుగా శ్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న గాడిమొగ పంచాయతీ బాబా నగర్ దళిత గ్రామానికి స్మశాన వాటిక ఏర్పాటులో అడ్డంకులు తగదని పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు చీకట్ల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం బాబా నగర్ గ్రామానికి కొంత మేర శ్మశాన వాటిక స్థలం చూపిస్తే ఇతరులు అడ్డంకులు పెట్టడం సబబు కాదన్నారు. దీనిపై మండల, జిల్లా స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి అధికారికంగా బాబా నగర్ గ్రామానికి ఎకరం శ్వశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.










