రాయచోటి టౌన్ :దళితుల శ్మశాన భూములను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. దళితుల శ్మశాన భూమిని కాపాడాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఓబులవారిపల్లి మండలం, వై.కోట గ్రామం కొత్త అరుంధతివాడ దళితులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకుల అండదండలతో మల్లం శంకరయ్య, చింతగుంట సీనయ్య తదితరులు కబ్జాకు పాల్పడుతున్నారని గ్రామస్తులు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దళితుల భూములు కాపాడాలని, కబ్జాదారులకు వంతపాడుతున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, భూ కబ్జాలను అరికట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో భూ కబ్జాలు పెట్రేగిపోతున్నాయని, దీనికి అధికార పార్టీ నాయకులు వత్తాసు పలకుతున్నారని అన్నారు. అందులో భాగంగానే ఓబులవారిపల్లి మండలం వై కోట రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 569లో ఉన్న 2ఎకరాల దళితుల శ్మశాన భూమిని కబ్జాదారులు వదలలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారులకే వంత పాడటం సిగ్గుచేటు అన్నారు. అధికార పార్టీకి చెందిన వైసిపి నాయకులు భూకబ్జాదారులను రెచ్చగొడుతూ దళితులను ఊర్ల నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేయడం అత్యంత హేయమన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని దళితుల మీద దాడికి పాల్పడుతున్న వారిపైనా, భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపైనా క్రిమినల్ కేసులతో పాటు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని, శ్మశాన భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గిరీషాకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామచంద్ర, వెంకటాచలపతి, పెంచలయ్య, తోపాటు కొత్త అరుంధతి వాడ గ్రామ ప్రజలు నరేంద్ర, ప్రుధ్వి, మల్లికార్జున, నవీన్, ఈశ్వర్, శివరామయ్య, జయరామయ్య, ఈశ్వరయ్య, సరస్వతి, రమణమ్మ, పెంచలమ్మ పాల్గొన్నారు.










