May 07,2023 21:28

ఆలయం పక్క ఉన్న దారిని మూసివేస్తూ అక్రమంగా కట్టిన కట్టడాన్ని చూపుతున్న దళితులు

దళితుల పట్ల వివక్ష
- దేవాలయం పక్కన నడవకూడదని దారిలో అక్రమ కట్టడం
- అధికారులకు తెలిపినా పట్టించుకోని వైనం
ప్రజాశక్తి - కొత్తపల్లి

      కొత్తపల్లిలో దళితుల పట్ల నేటికీ వివక్ష కొనసాగుతోంది. ఆలయం పక్కన దళితులు నడవకూడదని అనేక సంవత్సరాలుగా ఉన్న దారిలో అక్రమంగా కట్టడాలు చేపట్టి రస్తాను మూసివేస్తున్నారు. గతంలో 2014 సంవత్సరంలోనూ ఇదే సమస్య రాగా దళితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను తొలగించారు. నేడు అదే సమస్య మళ్లీ పునరావృతమయింది. అయితే ఈసారి అధికారులకు విషయం తెలిపినా పట్టించుకోవడం లేదు.
కొత్తపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఎదురుగా చౌడేశ్వరి దేవాలయం ఉంది. ఈ ఆలయం పక్కన దళితులు నివసించే గృహాలకు పూర్వ కాలం నుంచి రస్తా ఉంది. సర్వే నంబర్‌ 27లోనూ ప్రభుత్వ భూమి రస్తా అని ఆన్‌లైన్‌లో ఉంది. అయితే కొందరు అగ్రకులస్తులు ఇక్కడ రస్తా లేదని దారిని మూసివేయడానికి ఏకంగా గోడ నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి రస్తా ఉంది. ఈ దారిలో అంగన్వాడీ కేంద్రానికి పిల్లలు, జిల్లా పరిషత్‌ పాఠశాలకు విద్యార్థులు వెళ్తురటారు. అగ్రకులస్తులు మాత్రం దేవాలయంలో పూజలు చేస్తున్న సమయంలో ఈ రస్తాలో నడవకూడదని బహిరంగంగానే తమను అవమానపరిచారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితులు ఈ సమస్యపై సంబంధిత అధికారులను కలిసి రస్తాలో అక్రమ కట్టడాలు తొలగించాలని విన్నవించినా ఫలితం లేదు. గతంలో ఇలాంటి సమస్య 2014 సంవత్సరంలోనూ జరిగింది. అయితే అప్పటి అధికారులు దళితుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి అక్రమ కట్టడాలు తొలగించారు. ప్రస్తుతం మళ్లీ అగ్ర కులస్తులు మళ్లీ ఈ దారిని మూసివేసేందుకు ఏకంగా అక్రమంగా కట్టడాన్ని చేపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రస్తాకు అడ్డంగా కడుతున్న అక్రమ కట్టడాలను తొలగించి తమకు దారి చూపించాలని స్థానిక దళితులు అంజనమ్మ, రామాంజనేయులు కోరుతున్నారు.