
ప్రజాశక్తి - భీమవరం
దళితులకు శ్మశానవాటిక, భూములు పంపిణీ, పరిరక్షణకు పోరాడాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు కోరారు. విజయవాడలో కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన మహాధర్నాకు జిల్లా నుంచి కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, దళిత్ శోషన్ ముక్తి మంచ్ (డిఎస్‌ఎంఎం) జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావుకు ఉభయ సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో దళితులు ఎదుర్కొనే శ్మశానవాటిక, భూములు పంపిణీ, పరిరక్షణకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు కె.క్రాంతిబాబు, జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ దళితుల భూముల రక్షణ కోసం ఉద్యమించాలని కోరారు.
త్వరలో ప్రతి దళిత పేటలో పర్యటిస్తాం
అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్, జాతీయ నాయకులు శ్రీనివాసరావు
జిల్లా నాయకులు అందించిన వినతిపత్రంపై వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, డిఎస్‌ఎంఎం జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు స్పందించారు. త్వరలోనే జిల్లాలో దళిత పేటల్లో అధికంగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తామని తెలిపారు. జిల్లాలో చేస్తున్న పోరాటాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజరుకుమార్, సహాయ కార్యదర్శులు కానేటి బాలరాజు, చిన్నం చిననాగేశ్వరరావు, మాదాసి గోపీ, జిల్లా కమిటీ సభ్యులు జి.శ్యామ్‌బాబు, గొల్లా ఏడుకొండలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సంజీవరావు, యడ్ల చిట్టిబాబు, జె.వెంకటలక్ష్మి, పోతుల మృత్యుంజయ పాల్గొన్నారు.