ప్రజాశక్తి-కాకినాడ రూరల్ దళితుల నివాసాల కూల్చివేతకు కోర్టు ఆదేశానుసారం సర్వే నిర్వహించడంతో స్థానిక సర్పవరంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో 2016లో దళితపేటలో రోడ్ల వెడల్పు నిమిత్తం నాలుగు ఇళ్లు తొలగించాలని పుల్లా సత్తిబాబు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి సర్వే నిర్వహించడం కోసం పంచాయతీ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సంబంధిత స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించి సర్వేను చేపట్టారు. ఈ నేపథ్యంలో సర్పవరం గ్రామంలో దళిత సంఘం నాయకులు అడ్డుకుంటూ దళితపేటలో నాలుగు ఇళ్లు మాత్రమే తొలగించడం దారుణం అంటూ, తమకు న్యాయం చెయ్యక పొతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్ బాటిల్‌తో బాధితురాలు హల్‌చల్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకొన్న రూరల్ తహశీల్దారు మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే సర్వే ని చెప్పారు. ఎవరి ఇళ్లనూ బల వంతంగా తొల గించడం జరగ దని, పూర్తి సర్వే నిర్వ హించి కోర్టుకు తెలి యజేస్తామని చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఎంఆర్‌పిఎస్ జిల్లా అధ్యక్షులు పలివెల విజయకుమార్ మాట్లాడుతూ ఒసి సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి దళితుల ఇళ్లను మాత్రమే కూల్చాలని చూస్తున్నాన్నారు. ఇదే ప్రాంతంలో చర్చి, దళితులకు సంబంధించిన భూములు ఉండడం వల్లే వారికి భూమి విలువ తగ్గిపోయిందంటూ ఒక సామాజిక వర్గానికి చెందినవారు ఆరోపించడం తగదన్నారు. కుల వివక్ష చూపిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రానున్న రోజుల్లో ఈ భూమి విషయంపై సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తీవ్ర ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఉన్న అన్ని దళిత సంఘాలు ఏకమై మా భూమిని కాపాడుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే సర్వే నిర్వహిస్తున్నామని నచ్చజెప్పడంతో పూర్తి సర్వే నిర్వహించారు.










