
ప్రజాశక్తి - లేపాక్షి : కుశలవ ప్రాజెక్టు కోసం అక్రమించుకున్న మండలంలోని కొండూరు , కొర్లకుంట గ్రామాలకు చెందిన దళితులు, బలహీన వర్గాలకు భూములను తిరిగి వారికే అప్పగించాలని సిపిఎం, కెవిపిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్యాక్రాంత భూముల్లో సిపిఎం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళితులు బుధవారం పార్టీ జెండాలు నాటారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ కుశలవ ప్రాజెక్ట్ ప్రతినిధులు దళితులను టార్గెట్ చేశారన్నారు. వారి భూముల్లో పరిశ్రమలు పెట్టి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మోస పూరిత మాటలు చెప్పి అక్రమంగా దౌర్జన్యంగా వందలాది ఎకరాలు భూమిని లాక్కొని వందలాది దళిత కుటుంబాలను నిరాశ్రయులను చేశారని విమర్శించారు. మోసం చేసిన కుశలవ ప్రాజెక్ట్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెండు సంవత్సరాలనుండి వివిధ రూపాల్లో విజ్ఞప్తులు , నిరసనలు చేసినా సంబంధిత రెవిన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు. నిబంధనలు , చట్టాలను పాటించకుండా దళితుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మొత్తంగా అధికారులు, కుశలవ పెత్తందారులు కుమ్మక్కై దళితుల భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుశలవ ప్రాజెక్ట్ దళితుల భూములు మీద కోట్లాది రూపాయలు బ్యాంకు రుణాలు పొందిందని అన్నారు. తాము జెండాలు పాతిన ఈ భూముల్లో 4 రోజులు తరువాత విత్తనాలు వేసి సాగు చేస్తామని చెప్పారు. అధికారులు నిబంధనలు ప్రకారం దురాక్రమణ అయిన భూములు దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం జరిగే వరకు కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం , సిపిఎం అండగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘటనాస్థలాన్ని ఎస్‌ఐ శ్రీనివాసులు, విఆర్‌ఒ శేషచలం సందర్శించారు. ఈ భూముల్లో ఎవరు పంట వేయరాదని చెప్పారు. రెవెన్యూ వారి పిర్యాదు మేరకు కుశలవ మేనేజ:్‌మెంట్‌పై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, జిల్లా కమిటీ సభ్యులు నారాయణ , రాయుడు , మంజు , స్థానికులు గోపాలకృష్ణచ దళితులు నరసింహాప్ప , గంగాధర్ , మల్లిఖార్జున, రామలక్ష్మమ్మ , నాగమ్మ , ముద్దమ్మ తదితరులు పాల్గొన్నారు.