ప్రజాశక్తి - లేపాక్షి : మండల పరిధిలోని కొండూరు గ్రామంలో కోర్లకుంట, కొండూరు గ్రామాలకు చెందిన సుమారు 147ఎకరాల దళితుల భూములు తిరిగి దళితులకు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. వీరి ఆధ్వర్యంలో బుధవారం కొండూరు రెవిన్యూ పొలంలోని సర్వె నెంబర్ 389, 388, 390, 402, 394, 246, 265, 372, 245, 274, 263, 375, 307, 242, 226, 215లలోని భూముల్లో దళితులు, నాయకులు ట్రాక్టర్లతో భూమిని చదును చేసి మొక్కజొన్న విత్తనాలు వేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కుశలవ అనే సంస్థ నిరక్ష్యరాస్యులైన రైతులను నమ్మబలికి భూములు ఇప్పించుకున్నారన్నారు. భూముల్లో కంపెనీలు పెట్టి ఉపాధి కల్పిస్తామని చెప్పారన్నారు. అయితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఉపాధి లభించలేదని అన్నారు. ఈనేపథ్యంలో ఈ భూముల్లో వ్యవసాయం చేసుకొని జీవించాలన్న ఉద్దేశ్యంతో రైతులు పొలంలోకి వెళితే కేసులు బనాయించి భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతధికారులు స్పందించి వెంటనే దళితులు భూములు వారికే ఇచ్చి వ్యవసాయం చేయడానికి సహకరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే భూములు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు జ్యోతి, రామకృష్ణ, వెంకటేష్, గంగాధరప్ప తదితరులు పాల్గొన్నారు.