
ప్రజాశక్తి - పంగులూరు
తూర్పు కొప్పెరపాడు దళితుల భూముల్లో కొంతమంది రోడ్డు వేయటాన్ని గురువారం సాయంత్రం రెవెన్యూ అధికారులు పరిశీలించారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన కొద్దిపాటి భూముల్లో అక్రమంగా రోడ్డు నిర్మించారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ దళితులు తహశీల్దారు పద్మావతిని బుధవారం దళితులు కలిశారు. దళితుల ఫిర్యాదుపై దళితుల భూములను పరిశీలించేందుకు ఆర్ఐ రామకృష్ణ, సర్వేయర్ వినోద్, విఆర్ఓ పరశురామిరెడ్డి లను పరిశీలనకు పంపారు. ఈ మేరకు ఆ ముగ్గురు దళితుల భూములను, అందులో వేసిన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు రాయని వినోద్ బాబు అధికారులతో మాట్లాడుతూ 40ఏళ్ల క్రితం ప్రభుత్వం దళితులకు ఒక్కొక్కరికి 30సెంట్లు లెక్కన భూములు ఇచ్చిందని చెప్పారు. ఆ భూములకు పట్టాలు, పాస్ పుస్తకాలు కూడా ఇచ్చారని అన్నారు. ఇటీవల జరిగిన రిసర్వేలో జగనన్న భూ హక్కు చట్టం క్రింద కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారని అన్నారు. వీరికి ఇంతకుమించి వేరే ఆధారం లేదని రెవిన్యూ అధికారులకు తెలిపారు. ఇందులో రోడ్డు నిర్మిస్తే వారికి ఎంత మిగులుతుందని ప్రశ్నించారు. తక్షణమే పేదలకు అధికారులు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ఈ భూమి దళితుల దేనని అన్నారు. ఇందులో రోడ్డు నిర్మాణం నేరమేనని అన్నారు. దళితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దళితులు వేమూరి సునంద బాబు, ఎడ్లూరి శేషయ్య, పాలపర్తి అబ్రహం, పాలపర్తి దశరథ, ఉసులుమాటి బెనర్జీ, పాలపర్తి మస్తాను, పాలపర్తి మోషే, పాలపర్తి రత్నరాజు, పాలపర్తి అశోక్, పాలపర్తి సందీప్, లక్ష్మయ్య పాల్గొన్నారు.