
ప్రజాశక్తి-ఉక్కునగరం : దళితుల భూములకు రక్షణ కల్పించాలని జివిఎంసి 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత వడ్లపూడి సర్వే నెంబర్ 11/2 దళితుల సామాజిక భవనం, గ్రంథాలయం భవనాన్ని కూల్చివేసి పోలీసుల అండతో పెత్తందారులు ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ కెవిపిఎస్ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం దువ్వాడ పోలీస్ స్టేషన్ సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ ధర్నానుద్దేశించి డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ, 30 సంవత్సరాలుగా ఈ భూమిపై దళితులకు హక్కు ఉందని, దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయని తెలిపారు. గతంలో హైకోర్టును ఆశ్రయించి వాటిపై స్టేటస్-కో పొందినప్పటికీ రాజకీయ నాయకుల సహకారంతో వాటిని ఆక్రమించుకోవడానికి ఆక్రమణదారులు పోలీసుల సహాయంతో రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. ఈ పద్ధతిని కొనసాగిస్తే దళితుల భూములతో పాటు వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుందన్నారు. కాపాడవలసిన పోలీసులు వారిపై దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి టి.చిరంజీవి, అధ్యక్షులు ఎం.సుబ్బన్న, కె.అప్పారావు, నూకరాజు, శ్రీరాములు, గంగాభవాని, లక్ష్మి, పద్మ, అధిక సంఖ్యలో మహిళలు, దళితులు పాల్గొన్నారు.