
ప్రజాశక్తి-రోలుగుంట:జగనన్న భూ రీసర్వేలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని రోలుగుంట మండలం రత్నంపేటకు చెందిన దళితులు మంగళవారం సచివాలయం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ, రోలుగుంట మండలం పనసలపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 2, 3, 4, 6, 11లో 28 ఎకరాల భూములు 30 కుటుంబాలు, రత్నంపేట దళితులు, ఇతర పేదలు పూర్వం నుండి జీడిమామిడి వంటి పంటలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. 2022 సెప్టెంబర్‌లో వైయస్సార్ జగనన్న భూ రీసర్వే పనసలపాడు రెవెన్యూ గ్రామాన్ని పైలట్ గ్రామంగా గుర్తించి భూ సర్వే నిర్వహించారని తెలిపారు. సర్వే చేసేటప్పుడు సాగులో ఉన్న వారి పేర్లు, రికార్డులో నమోదు చేశారని, అనంతరం సాగులో లేని వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.సాగులో ఉన్న వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, గ్రామ సభ పెట్టకుండా, 9(2) నోటీసు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా రోలుగుంట తహశీల్దార్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కుమ్మక్కై సాగులో లేని వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారని విమర్శించారు. ఈ విషయమై 2022 డిసెంబర్ 9న, 2023 జనవరి 22న నర్సీపట్నం స్పందన సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని తెలిపారు. తాము సాగులో ఉన్న భూములకి సాగులో లేనట్టుగా రికార్డు తయారు చేశారని, వీటిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఫిర్యాదు పై రెవిన్యూ కార్యదర్శి గ్రామాన్ని సందర్శించి తాము సాగులో ఉన్నట్టుగా రిపోర్టు ఇచ్చారని, అధికారుల్ని వీటిని పట్టించుకోకుండా గిరినేతరులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దళిత సంఘం నాయకులు ఆర్లి అప్పారావు పాల్గొన్నారు.