
కెవిపిఎస్ ఆధ్వర్యాన నిరసన
ప్రజాశక్తి - పెనుమంట్ర
దళితపేటలో తక్షణం రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజరుకుమార్ డిమాండ్ చేశారు. పెనుమంట్రలోని దళితపేటలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బత్తుల విజరుకుమార్ మాట్లాడుతూ దళితపేటలో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి వ్యవస్థ లేక దళితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షా కాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. మండల కేంద్రంలో ఉన్న దళితపేటలనే పట్టించుకోకపోతే సుదూర గ్రామాల్లో దళితపేటల్లో సమస్యలను ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. ఎస్‌సి కాలనీకి ఆనుకుని ఉన్న కొత్త కాలనీలో చాలామంది ఇళ్లు నిర్మించుకున్నారని, రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక నిర్మాణ సామగ్రి తెచ్చేందుకు వేలకు వేలు ఖర్చుపెట్టాల్సి వస్తోందన్నారు. తక్షణం కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె.జాన్, ఎన్.దుర్గారావు, కె.సురేష్ పాల్గొన్నారు.