
ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలో దళిత సమస్యలపై ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని పున్ణప్రారంభించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతిబాబు మాట్లాడుతూ జిల్లాలో దళితులు ఎదుర్కొనే ప్రతి సమస్యపై కెవిపిఎస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. జిల్లా విభజన అయ్యాక దళితుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అధికారులు చెప్పారన్నారు. గతంలో దళిత సమస్యలపై ప్రత్యేకంగా స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఆ కార్యక్రమాన్ని కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ప్రతి సోమవారమూ జరిగే స్పందన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా దళితులు వారి సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెలాఖరున జరిగే సివిల్ రైట్స్ డే కార్యక్రమం అన్ని మండలాల్లో తూతూమంత్రంగా జరుగుతోందని విమర్శించారు. కులవివక్ష, అంటరానితనం వంటి అంశాలపై చర్చ జరపాల్సిన అధికారులు కేవలం దళితులను మాత్రమే పిలిచి సంక్షేమ పథకాల కోసం వివరించి సమావేశాన్ని ముగించడం దారుణం అన్నారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో 70 శాతం దళితపేటల్లో పూర్తిస్థాయిలో శ్మశానవాటికలు లేవని తెలిపారు. వర్షాకాలం వల్ల దళితపేటలో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రతి దళితపేటలో శానిటేషన్ చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు చిన్నం చిన్న నాగేశ్వరరావు, కానేటి బాలరాజు, మాదాసి గోపి, జిల్లా కమిటీ సభ్యులు కింతాడ రమేష్, మువ్వల రాజారావు, పి.శ్యాంబాబు పాల్గొన్నారు.