ప్రజాశక్తి-కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవు దళితుల సమస్యల పరిష్కారం కోసం కెవిపిఎస్ సమరశీల పోరాటాలు చేస్తోందని పలువురు అన్నారు.. సోమవారం కెవిపిఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సుందరయ్య భవన్ వద్ద కెవిపిఎస్ జెండాను సీనియర్ దళిత నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు ఆవిష్కరించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రామేశ్వరరావు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కెఎస్.శ్రీనివాస్ మాట్లాడారు. దళితులు ఆత్మ గౌరవంతో జీవించాలంటే, కోనేరు రంగారావు భూ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలన్నారు. ఉపాధి కూలీలకు గ్రామాల్లో 200 రోజులు పనులు కల్పించి, వేతనం రూ.600 ఇవ్వాలని, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, పోలీస్ స్టేషన్లో 41 సిఆర్‌పిసి నోటీసులు తీసుకొని దోషులను విడుదల చేసే పద్ధతిని ఆపివేయాలని, పైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వత చట్టంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, తదితర డిమాండ్లతో డిసెంబర్ 4న చలో ఢిల్లీ చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సత్తా సీనియర్ బచ్చల కామేశ్వరరావు, నాయకులు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బుడితి సురేష్ కుమార్, ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం విరవ పిహెచ్‌సి కాలనీ వద్ద కెవిపిఎస్ జెండాను ఆవిష్కరించారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె.సింహాచలం, మండల కన్వీనర్ ఎం.ఫ్రెడరిక్, నాయకులు మేడపాటి చంటిబాబు, రాగం సత్తిరాజు, కె.కుమారి, యేసుబాబు, విజరు, నూకరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవులో మండల అధ్యక్షుడు విప్పర్తి శ్రీనివాసరావు కెవిపిఎస్ జెండాను ఆవిష్కరించారు. కో కన్వీనర్ పులపకూర గోపాలకృష్ణ, తణుకు రాంబాబు, కన్నీడి వెంకటరమణ, నేరేడుమిల్లి త్రిమూర్తులు, ఎం.సూరిబాబు, సుందరపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.










