Sep 17,2023 22:28

ప్రజాశక్తి - కాళ్ల
            రాజ్యాంగంలో దళితుల హక్కులను కాలరాస్తున్న మతోన్మాద బిజెపిని విధానాలను ఐక్య ఉద్యమాల తిప్పికొట్టాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, సిఐటియు జిల్లా నాయకులు గొర్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీన వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న దళిత రక్షణయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ సంతకాల సేకరణను సీసలి గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహం సెంటర్లో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ, రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సనాతన ధర్మం పేరుతో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసి దళితుల నిధులను, చట్టాలను నీరుగారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మహిళా జిల్లా కన్వీనర్‌ జక్కంశెట్టి వెంకటలక్ష్మి, కెవిపిఎస్‌ మండల నాయకులు బాతు రామస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్‌ దాసి లాజర్‌ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులు దళితపేటలకు ఖర్చు చేయకుండా ఇతర సంక్షేమానికి మళ్లించడం వల్ల దళిత పేటలో రోడ్లు, డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. మరోపక్క అసైన్డ్‌ చట్టాన్ని సవరణ చేసి దళితుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రద్దు చేసిన దళితుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.
ఈనెల 21వ తేదీన ప్రచార యాత్ర భీమవరంలో ప్రారంభం అవుతుందని ఆరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కాళ్ల మండలం చేరుకుంటుందని తెలిపారు. అనంతరం ఈ నెల 29వ తేదీన భీమవరంలో మహాధర్నా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ సంఘ పెద్దలు, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.