
ప్రజాశక్తి -పెనుకొండ : విజయవాడలో ఈనెల 28న జరిగే దళిత రక్షణ యాత్రను జయప్రదం చేయాలని కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిమిషానికి ఒకసారి ఎక్కడో ఒక చోట కుల వివక్షత దాడులు దౌర్జన్యాలు భూ ఆక్రమణలు, లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. దళితులకు రక్షణగా అనేక రకాల శక్తుల పోరాటాల అనంతరం వచ్చిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రోజురోజుకు అపహాస్యం పాలవుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కెవిపిఎస్ చొరవతో దళితులకు ఆర్థిక ప్రగతి కోసం యోధ సంఘాలకు కలుపుకొని నిర్వహించిన పోరాటాల ఫలితంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం 2013లో సాధించామన్నారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ దళితులపై దాడులు పరంపరం కొనసాగుతూనే ఉందన్నారు. కుల వివక్షత రూపుమాపక పోగా రూపం మార్చుకుంటూ పట్టణ ప్రాంతాలకు సైతం ఎగపాకుతోందన్నారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దళితుల ఆత్మ గౌరవం, ఉపాధి, సంక్షేమం మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, అంటరానితనం, కుల నిర్మూలన,సామాజిక న్యాయం సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా దళిత రక్షణ యాత్రను నిర్వహిస్తున్నామనిచెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్, జ్యోతమ్మ తదితరులు పాల్గొన్నారు.