ప్రజాశక్తి-తాళ్లరేవు దళితులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో సుబ్బారావు మాట్లాడారు. పటవలలో బూరుగుపుంత ప్రస్తుత పైడా కళాశాల వెనుక ప్రాంతంలో సర్వే నెంబర్ 486/4, 486/ 2లో పంట కాలువ గట్టున ఏడుగురికి ఒక్కొక్కరికీ 30 సెంట్ల చొప్పున 1977లో కేటాయించినట్టు లబ్ధిదారులు తెలిపారు. దడాల సుబ్బరాజు, మురమళ్ల శ్రీను, దడాల సత్యనారాయణ, వేళంగి సత్యనారాయణ, నేల సత్యనారాయణ, మురుగు సాయిబాబు, నాగాబత్తుల అప్పారావు నాయకులతో మాట్లాడారు. ఈ భూముల్లో కొంత మేరకు మొక్కలు వేసామని అయితే ఇటీవల ఆ భూములలో పైడా కళాశాల యాజమాన్యం కళాశాలలోని చెత్తను వేస్తూ ఆ ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్‌గా పయోగిస్తోందని తెలిపారు. మరికొంత భూమిలో పైడా కళాశాల అక్రమ కట్టడాలు నిర్మించిందని వాటిని తొలగించాలని, పైడా కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమ భూములను తిరిగి తమకు అప్పగించాలని లబ్ధిదారులు కోరారు. ఆ భూములను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దదాల సుబ్బారావుతో కలిసి సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్.శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా దడాల సుబ్బారావు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం 1977లో పటవల పంచాయతీ పరిధిలో ఏడుగురు దళిత లబ్ధిదారులకు ఇచ్చిన భూమిని వారికి అప్పగించాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు దుప్పి అదృష్టదీపుడు పాల్గొన్నారు. పాల్గొన్నారు.










