Sep 28,2023 22:50

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
         కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల, పేదల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. గురువారం ఏలూరులో బిల్డింగ్‌ వర్కర్స్‌ సెంటర్లో దళిత హక్కులు - సామాజిక న్యాయం, అసైన్డ్‌ భూముల చట్ట సవరణ రద్దు చేయాలని కోరుతూ సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సిఎం జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దళితులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చి 41 సిఆర్‌పిసి ప్రకారం బెయిల్‌ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు అమలు చేయకపోగా వాటిని తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వారసత్వంగా వస్తున్న అసైన్డ్‌ భూముల చట్ట సవరణ చేసి అసెంబ్లీలో ఆమోదించడం దళితలు, పేదల భూములను భూస్వాములకు కట్టబెట్టటమే అవుతుందని విమర్శించారు. రాష్ట్రంలో దళితుల ఓటుతో గెలిచిన సిఎం జగన్‌ వారి ఉసురుతీస్తున్నారని విమర్శించారు. అలాగే 45 సంవత్సరాలు దాటిన డప్పు కళాకారులకు, చర్మకారులకు పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. శ్మశానాలకు ఇచ్చిన జిఒ 1235 అమలుకు నోచుకోలేదన్నారు. దళిత, గిరిజనులకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 300 యూనిట్లకు పెంచాలని కోరారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్‌ మోనటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసి సంఘాలకు ఆ కమిటీల ప్రాతనిథ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం 29న విజయవాడలో జరుగుతున్న మహాధర్నాలో దళితులు, పేదలు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు అందరూ హాజరు కావాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ నాయకులు ఎం.ఇస్సాకు, పి.బాలరాజు, కిషోర్‌ పాల్గొన్నారు.