Sep 22,2023 23:16

ప్రజాశక్తి - కాజులూరు దళితుల హక్కుల సాధన కోసం ఈ నెల 29 విజయవాడలో చేపట్టిన దళిత రక్షణ మహాధర్నా పోస్టర్‌ను కుయ్యేరులో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్‌.శ్రీనివాస్‌ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం, ఉపాధి సంక్షేమం దళిత పేటల అభివృద్ధి, సమానత్వం సామాజిక న్యాయం కోసం కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టినట్టు చెప్పారు. మండలంలో వివిధ గ్రామాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కదారు పట్టించడమే కాక ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరుగారిస్తున్నాయన్నారు. బిజెపి మతోన్మాద శక్తులు మనువాద రాజ్యాంగం అమలుకు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడి ప్రైవేట్‌ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని, కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్లతో ఈ మహా ధర్నా చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ పోస్టర్‌ ఆవిష్కరణలో బచ్చల శర్మ, తాతపూడి రాంబాబు, తాతపూడి లాజరు, ఇజ్రాయిల్‌ పాల్గొన్నారు.