
దళిత గ్రామంపై వివక్ష
- మధ్యలోనే ఆగిన బ్రిడ్జి నిర్మాణం
- అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం
- వాహనాలు, ఎద్దుల బండ్లు వెళ్లలేని పరిస్థితి
- ఇబ్బందుల్లో కోల్స్ ఆనందపురం గ్రామస్తులు
ప్రజాశక్తి - పాములపాడు
దళితుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆధికార పార్టీ నేతలు బహిరంగ సభల్లో ఊదరగొట్టు ఉపన్యాసాలు ఇస్తుంటారు. దళితుల పక్షపాతమని చెప్పుకుంటూ, వారి అభివృద్ధి కోసం గ్రామాల్లోని దళితవాడలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ఉపన్యాసాలు, హామీలు ఇస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రభుత్వాలు మారినా, ఎమ్మెల్యేలు మారినా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మారినా నేటికీ దళిత గ్రామమైన కోల్స్ ఆనందపురం బ్రిడ్జి సమస్య పరిష్కారాని నోచుకోవడం లేదు. దళిత గ్రామమైనందుకే అధికారులు, పాలకులు సమస్యను పట్టించుకోకుండా వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు..
పాములపాడు మండలంలోని జూటూరు మజరా గ్రామం కోల్స్ ఆనందపురం పూర్తిగా దళిత గ్రామం. ఈ గ్రామానికి వెళ్లాలంటే కెసి కెనాల్‌పై ఉన్న బ్రిడ్జి దాటి వెళ్లాలి. కానీ కెనాల్‌పై ఉన్న వారధి బ్రిటిష్ కాలం నాటిది కావడంతో శిధిలావస్థకు చేరుకుంది. దీంతో వాహనాలు, ఎద్దుల బండ్లు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. బ్రిటీష్ కాలంలో కెసి కెనాల్‌పై నిర్మించిన వంతెనలను గత ఇరవై సంవత్సరాల క్రితం కూలగొట్టి కొత్తగా నిర్మించారు. కానీ ఈ గ్రామంలో ఉన్న వంతెనను మాత్రం అలాగే వదిలేశారు. 2007 సంవత్సరంలో నాటి జడ్పి చైర్మన్ లబ్బి వెంకటస్వామి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ పిల్లర్స్ వరకు నిర్మించి మధ్యలో వదిలేశారు. నాటి నుండి నేటి వరకు వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. పలు ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం, వామపక్షాల నాయకులు ఎన్నోసార్లు సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేల దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీని సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ చేశాక నందికొట్కూరు నియోజకవర్గం ఎస్‌సి రిజర్వ్ కావడంతో ముగ్గురు దళిత ఎమ్మెల్యేలు మారినప్పటికీ దళిత గ్రామ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ఈ ఘటన వివక్షకు నిదర్శనం. నేటికైనా ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
దళిత గ్రామంపై వివక్ష తగదు
స్వాములు, బిఎస్‌పి నందికొట్కూర్ ఇంచార్జి
కెసి కెనాల్‌పై బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెనలను కూలగొట్టి గత 20 సంవత్సరాల కిందటే కొత్తగా నిర్మించారు. ముచ్చుమర్రి, పగిడ్యాల గ్రామాలలో మళ్లీ కొత్త బ్రిడ్జిలు నిర్మించేందుకు బడ్జెట్ శాంక్షన్ అయింది. కానీ దళిత గ్రామమైన కోల్స్ ఆనందపురానికి పురాతనమైన బ్రిడ్జి కూలగొట్టి బ్రిడ్జి నిర్మించేందుకు అధికారులు, ప్రభుత్వం వివక్ష చూపుతున్నారు. ముగ్గురు దళిత ఎమ్మెల్యేలు పని చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా స్పందించకపోతే నిరాహార దీక్షలు చేపడతాం.
బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి
- సామన్న, సిపిఎం మండల కార్యదర్శి.
కోల్స్ ఆనందపురం గ్రామానికి కెసి కెనాల్‌పై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి రవాణా సౌకర్యాన్ని కల్పించాలి. ఈ సమస్యపై ఎన్నోసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వం, అధికారులు పెడచెవిన పెడుతున్నారు. రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలంటే గ్రామానికి వాహనాలు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది.తక్షణమే అధికారులు ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలి. లేనిపక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.










