దళిత గిరిజనులకు తక్షణమే భూ పంపిణీ చేయాలి
ప్రజాశక్తి-కావలి : దళిత, గిరిజనులకు తక్షణమే భూ పంపిణీ చేయాలని, అక్రమంగా గ్రావెల్ తవ్వుకొని వందల ఎకరాలు సర్వనాశనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం ఆర్‌డిఒ వి.కె.శీనానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారితో కలిసి వివరాలు తెలియజేశారు. అల్లూరు మండలం ఆములూరులోని 363 సర్వే నెంబర్లు 170 ఎకరాలు ఉండగా 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకున్నారన్నారు. వారికి ఎలాంటి అనుమతి లేనప్పటికీ పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూముల్లోని గ్రావెల్‌ను టైల్స్, కంపెనీలకు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారని తెలియజేశారు. దగదర్తి మండలం కౌరుగుంట, దామవరం, బోగోలు మండలంలోని తిప్ప, కావలి మండలంలోని రుద్రకోట ఇంకా అనేక చోట్ల ఇప్పటికి గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. తద్వారా స్థానిక అధికార పార్టీ నాయకులు రూ.కోట్లు గడిస్తున్నారని తెలియజేశారు. భూములు సర్వనాశనం చేసి ఎందుకు పనికిరాకుండా వందల ఎకరాలు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అల్లూరు మండలంలో సింగపేట గ్రామంలో వందల ఎకరాల భూములు ఒక్కొక్కరు 50 ఎకరాలకుపైగా సాగు చేసుకుంటు న్నారని, ప్రభుత్వ భూములు కావలి డివిజన్లో ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల్లో ఉన్న వాటి జోలికి తహశీల్దార్లు, అధికారులు ఎవరూ పోవడం లేదని వారిపై చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు. భూమిని సేకరించి పేద వర్గాలకు పంపిణీ చేయాలని అధికారులను వారు కోరారు. కార్యక్రమంలో బాపట్ల సత్యవతి, భాస్కర్, జాషువా విజయరత్నం, ఆనందరావు, విజయలక్ష్మి, ఆంజనేయులు, లలిత కుమారి పాల్గొన్నారు.










