
* ఎంపీ రామ్మోహన్ నాయుడు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, వేధింపులు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. దళిత పక్షపాతి అని చెప్పుకొని తిరుగుతున్న సిఎం జగన్.. దళిత ద్రోహి అని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై స్పందించిన ఆయన స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం విలేకరులతో మాట్లా డారు. కోవిడ్ సమయంలో వెనకబడిన తరగతికి చెందిన వ్యక్తి అనే కారణంతోనే డాక్టర్ సుధాకర్‌పై పిచ్చివాడిగా ముద్ర వేసి, చనిపోయేలా? చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్యం విధానంపై ప్రశ్నించిన వ్యక్తి మూడో రోజుల్లో అనుమానాస్పదంగా శవమై తేలడం దారుణ స్థితికి నిదర్శనమన్నారు. అదే వైసిపికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్ చంపి, ఇంటికి పంపిస్తే.. ప్రభుత్వం ఏ విధంగా చేతులు దులుపుకుందో, విడుదలయ్యాక జరిగిన సంబరాలను అంతా చూశామని అన్నారు. నీరు అడిగిన యువకుడిపై మూత్రం పోయడం... ఇలా ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రి స్పందన ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఆరు వేలకు పైగా అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ఎస్‌సి కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ సైతం ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గాల్సి రావడం విచారకరమన్నారు. ఆంధ్రాలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదని, జగన్ సొంత చట్టాలు అమలవుతున్నాయని దుయ్యబట్టారు. ఇకన్కెనా దళిత పక్షపాతి ప్రకటనలు, సవతి ప్రేమ విరమించుకోవాలని స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతులకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం మాత్రమే అని వివరించారు. ఇప్పటికైనా దళితులపై దాడులను ప్రభుత్వం అడ్డుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.