Jul 30,2021 11:45

న్యూఢిల్లీ : భారత్‌లో టిబెట్‌ ఆధ్యాత్మిక వేత్త దలైలామా సీనియర్‌ ప్రతినిధులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ భేటీ కావడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. టిబెట్‌ను చైనాలో భాగంగా అంగీకరిస్తున్న అమెరికా నిబద్ధతను ఉల్లంఘించడమేనని, దాని స్వతంత్రకు మద్దతునివ్వవద్దని పేర్కొంది. బుధవారం దలైలామా ప్రతినిధి, టిబెట్‌ బహిష్కృత నేత గోడప్‌ డంగ్‌చుంగ్‌తో బ్లింకెన్‌ సమావేశమయ్యారు. దీంతో టిబెటిన్‌ ఉద్యమానికి అమెరికా యంత్రాంగం మద్దతునిస్తుందని తెలిపేందుకు చైనాకు సంకేతాలిచ్చినట్లయింది. టిబెటియన్‌ ఉద్యమానికి అమెరికా నిరంతర మద్దతునివ్వడంపై ఈ సమావేశం సందర్భంగా డంగ్‌చుంగ్‌ ధన్యవాదాలు తెలిపారు. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..బ్లింకెన్‌ ఢిల్లీలో టిబెటిన్‌ ప్రతినిధి డంగ్‌చుంగ్‌, దలైలామాతో భేటీ అవనున్నారని తెలిపారు. అదేవిధంగా ఏడుగురు సివిల్‌ సొసైటీ సభ్యులతో బ్లింకెన్‌ నిర్వహించిన మరో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మరో టిబెటిన్‌ ప్రతినిధి గేషే డోర్జి ధామ్‌దుల్‌ పాల్గన్నారు. దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్‌ మాట్లాడుతూ..టిబెటిన్‌ వ్యవహారాలు పూర్తిగా చైనా అంతర్గత వ్యవహరమని, విదేశీ జోక్యం తగదని హెచ్చరించారు. 14వ దలైలామా కేవలం ఆథ్యాత్మిక నేత కాదని, చైనా నుండి టిబెట్‌ను వేరుచేసేందుకు దేశ వ్యతిరేక శక్తిగా తయారై...రాజకీయ బహిష్కరణకు గురయ్యారని అన్నారు.