Jan 19,2023 23:35

రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-హుకుంపేట: కాఫీ, మిరియాలు, పసుపు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, పంటలకు సరైన లాభసాటి ధరకే అమ్ముకోవాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ రైతులకు సూచించారు. గురువారం హుకుంపేట మండలం తాడిగిరి పంచాయతిలో పివిటిజి గ్రామం ముల్లుమెట్ట గ్రామాన్ని సందర్శించి కాఫీ, మిరియాలు, పసుపు రైతులతో మాట్లాడి పంటలను పరిశీలించి ధరలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది రైతులు మాట్లాడుతూ, గత ఏడాది అతి తక్కువ ధరకు సంతలలో అమ్మేవారమని, ఈ ఏడాది మంచి ధరకే అముతున్నామని కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ స్పందిస్తూ, కాఫీ రూ.250 లకు తక్కువ కాకుండా అమ్ముకునే అవకాశం ఉందని, అదేవిధంగా పసుపు, మిరియాలు కూడా మంచి రేటు లభించే విధంగా కొనుగోలుదారులను గ్రామానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముల్లుమెట్టలో సమస్యలు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తడిగిరి వైస్‌ సర్పంచ్‌, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కిల్లో రామారావు, కొంతమంది రైతులు తీసుకు వెళ్లారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఒరిగిపోయిన విధ్యుత్‌ స్థంబాలను పరిశీలించి మార్చాలని విధ్యుత్‌ శాఖాధికారులను ఆదేశించారు. నీటి సమస్య పై స్పందిస్తూ గ్రామాన్ని సందర్శించి నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇని ఆదేశించారు. గృహ నిర్మాణ బిల్లులు అందలేదని కొంతమంది కలెక్టర్‌ దృష్టికి తీసుకు రాగా అధికారులు పరిశీలించి నివేదిక అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంల కాపీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు సబ్‌ అసిస్టెంట్‌ బాలం నాయుడు, లైజన్‌ వర్కర్‌ కంభ శ్రీను, వాసు, రైతులు కిల్లో బుజ్జిబాబు, నాగేశ్వరరావు, మల్లేశ్వరరావు, సీదరి సుబ్బారావు, రాంబాబు, వెంకట్రావు, వాలంటీర్‌ మర్రి కమల, సీదారి అప్పలమ్మ, అంగన్‌ వాడి టీచర్‌ పాంగి జ్యోతి, ఆశ వర్కర్‌ కోసాయి, మహిళలు గంగమ్మ, సుబ్బలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.