Jan 04,2023 23:47

ధాన్యం కొనుగోలును ప్రారంభిస్తున్న ఎంపిపి సూర్యకుమారి

ప్రజాశక్తి- బుచ్చయ్యపేట
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మరిసా నాని అన్నారు. బుధవారం రాజాం రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. నీలకంఠపురం సర్పంచ్‌ పడాల నాగభూషణం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు రూ.2060, సాధారణ రకం రూ.2040కు మద్దతు ధర ఇస్తున్నట్లు చెప్పారు. సేకరించిన ధాన్యానికి 21రోజుల్లో రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి నాయుడు బాబు, ఎంపీఈఓ సంతోష్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రీధర్‌, రైతులు పాల్గొన్నారు.
రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు
సబ్బవరం : రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులకు అన్నివిధాలా సౌలభ్యంగా ఉంటుందని ఎంపీపీ బోకం సూర్యకుమారి అన్నారు. మండలంలోని మల్లునాయుడు పాలెం ఆర్‌బికెలో ధాన్యం కొనుగోలును బుధవారం ఆమె ప్రారంభించారు. సుమారు 332 ధాన్యం బస్తాలను 8 మంది రైతులు నుండి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ దళారుల బెడద లేకుండా రైతుల నుండి నేరుగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వీఆర్వోల సంఘ అధ్యక్షులు ఎస్‌టి.రామకాసు, సర్పంచ్‌ బోను దేముడమ్మ నాయుడు, వ్యవసాయాధికారి పోతల సత్యనారాయణ, ఎఈఒ బాలరాజు, విఎఎ హేమలత, యడ్ల నాయుడు, పిఎసిఎస్‌ సిబ్బంది రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.