వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధర ఇస్తున్న వైనం
ప్రజాశక్తి- కొయ్యూరు
దళారుల చేతిలో మండలంలోని జీడిపిక్కల రైతులు మోసపోయి నష్టపోతున్నారు. మండలంలో అనేక మంది రైతులు జీడి మామిడి సాగుపై ఆధారపడిన జీవిస్తున్నారు. వీరు పండించి సేకరించిన జీడి పిక్కలకు ఆశించిన స్థాయిలో ధర పలకటం లేదు. మండలల నుండి వేల టన్నులు జీడిపిక్కల రవాణా జరుగుతుంది. మైదాన ప్రాంత వర్తకులు నర్సీపట్నంలో బసవేసి దళారీల చేత గ్రామీణ ప్రాంతాలలో ఖరీదు చేయిస్తున్నారు. దళారులు సరైన ధర నిర్ణయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కాలంలో వర్తకులు సంఘాలుగా ఏర్పాటు చేసి బయట ప్రాంతల నుంచి వచ్చిన వర్తకులను కట్టడి చేశారు. దీంతో పలాస, ఒరిస్సా, కేరళ నుంచి వ్యాపారులు రాలేకపోతున్నారు. ఇక్కడి వ్యాపారులు రైతులకు సరైన ధర ఇవ్వడం లేదు. తొలుతగా 81 కేజీల బస్తా రూ.8,500 ధర ఉండగా, అది కాస్తా రూ.7,900కు పడిపోయింది. పక్క మండలాలైన రాజువొమ్మంగి, గొలుగొండ మండలం కేడీపేట ప్రాంతంలో రూ.8400కు ఖరీదు చేయగా కొయ్యూరు మండలంలో రూ.7900 మాత్రమే ఇస్తున్నారు. దీంతో మండలంలోని జీడి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.










