Aug 04,2021 19:13

న్యూఢిల్లీ : దక్షిణ చైనా సముద్రంలోకి ఈ నెల నౌకాదళాలను పంపనున్నట్లు భారత నేవీ పేర్కొంది. ఆగ్నేయాసియా, దక్షిణ చైనా సముద్రం, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతాలకు గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ (అణ్వాయుధాలను ధ్వసం చేసే పరికరం) క్షిపణి యుద్ధనౌకతో పాటు నాలుగు నౌకలను రెండు నెలల పాటు మోహరించనున్నట్లు నేవీ పేర్కొంది. స్నేహపూర్వక దేశాల మధ్య భద్రతా సంబంధాలను మరింత విస్తరించేందుకు ఈ చర్య చేపట్టినట్లు నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. నౌకలను తరలించడంతో పాటు సముద్ర ప్రాంతాల్లో కార్యాచరణను చేపట్టడంతో భారత్‌ తన శాంతియుత ఉనికిని, స్నేహపూర్వక దేశాల మధ్య సంఘీభావాన్ని తెలుపుతుందని పేర్కొంది. సాధారణ మిషన్‌లో భాగంగా ఈ ఏడాది జూన్‌లో యుఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌కు చెందిన అమెరికా ఎయిర్‌ క్రాఫ్ట్‌ కారియర్‌ గ్రూప్‌ దక్షిణ చైనా సముద్రాల్లోకి ప్రవేశించింది. అలాగే బ్రిటీష్‌ కారియర్‌ గ్రూప్‌ ఈ నెలలో పిలిఫ్పైన్స్‌ సముద్రంలో నావికా విన్యాసాలు చేయాల్సి వుంది. తమ విస్తరణలో భాగంగా భారత నౌకలు గువామ్‌ తీరంలో అమెరికా, జపాన్‌, అస్ట్రేలియా పాల్గొనే వార్షిక ఉమ్మడి యుద్ధనౌకల్లో పాల్గొంటాయని నౌకాదళం పేర్కొంది. సముద్ర ప్రాంత ప్రయోజనాలు, సముద్రంలో నేవిగేషన్‌ స్వేచ్ఛపట్ల నిబద్ధత ఆధారంగా భారత నావికా దళం చేపట్టనున్న ఈ కార్యకలాపాలు స్నేహపూర్వక దేశాల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరుస్తాయని నేవీ తెలిపింది.