Nov 16,2023 22:58

ఆర్థిక సహాయం అందిస్తున్న విద్యార్థులు


ప్రజాశక్తి-మార్కాపురం
తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఏకాశి రాముడు అనే దివ్యాంగునికి మార్కాపురం పట్టణంలోని కమలా స్కూల్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థుల చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని ఏకాశి రాముడుకి అందుకున్నారు. ఏకాశి రాముడు పుట్టుకతో రెండు చేతులు లేకుండా జన్మించాడు. ఓ కాలు కూడా అతి తక్కువ సైజులో ఉంది. ఏనాడూ అంగవైకల్యం ఉందని కుంగిపోలేదు. అతనిలో ఏదొకటి సాధించాలనే పట్టుదల ఉంది. ఏదైనా రంగంలో గుర్తింపు పొందాలనే తపనతో అనేక రంగాల్లో రాణిస్తున్నారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. రెండు చేతులు లేక పోయినా... కాళ్లతో మ్యూజికల్‌ డ్రమ్స్‌ వాయించడం, డాన్స్‌ చేయడం... కాలితో బొమ్మలు గీయడం వంటి కలలు పుణికిపుచ్చుకున్నారు. వేడుకల్లో, ఉత్సవాల్లో వేదికలపై అనేక డాన్స్‌ కార్యక్రమాలతో అందరి మనన్ననలు పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఏకాశి రాముడు మాట్లాడుతూ అంగవైకల్యం తన లక్ష్యానికి ఏమాత్రం అడ్డు కాలేదన్నారు. లక్ష్యం చేరేందుకు నిరంతరం కషి చేశానని పేర్కొన్నారు. అన్ని అవయవాలున్న మీరు నాకన్నా గొప్పగా అనేక రంగాల్లో రాణించాలని అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేలా సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ పుల్లయ్యతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.