
ప్రజాశక్తి- అనకాపల్లి
స్థానిక డివిఎన్ కళాశాల విద్యార్థులపై ఎస్‌ఐ దివాకర్ దురుసుగా ప్రవర్తించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఎస్‌ఐను సస్పెండ్ చేయాలని డివిఎన్ కళాశాల యజమాని, వైసిపి అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్, జనసేన నాయకులు పరుచూరి భాస్కరరావు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి... బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో భాగంగా స్థానిక చోడవరం బస్టాప్ వద్ద రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్, ఇతర అధికారులు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాల వేస్తున్న సమయంలో జై జనసేన అంటూ నినాదాలు వినిపించాయి. అయితే పక్కనే ఉన్న డివిఎన్ కళాశాలకు చెందిన విద్యార్థులే నినాదం ఇచ్చి ఉంటాడని భావించిన మంత్రి అమర్నాథ్ ఎస్సై దివాకర్‌ను చూడండని ఆదేశించారు. దీంతో ఎస్సై దివాకర్ కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించకుండానే లోనికి ప్రవేశించి విద్యార్థులను నోటికి వచ్చినట్టు దూషించి కాలర్ పట్టుకొని లాక్కొచారు. ఈ సమయంలో ప్రిన్సిపల్ అడ్డుకున్నా వినిపించుకోలేదు. విషయం తెలుసుకున్న డిఎస్‌పి మల్ల మహేష్, సిఐ మోహన్‌రావు కళాశాలను సందర్శించారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, రత్నాకర్‌తో చర్చించి విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సంఘటనపై రత్నాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎస్‌ఐ దివాకర్‌ను సస్పెండ్ చేయాలి
డివిఎన్ కళాశాల విద్యార్థులపై దాడికి పాల్పడిన ఎస్సై దివాకర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆ కళాశాల యజమాని, వైసిపి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 1993 నుంచి కళాశాలను రాజకీయాలకు అతీతంగా నడుపుతున్నామని, ఇటువంటి సంఘటనలు ఎప్పుడు చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. ఎస్సై దివాకర్ ప్రవర్తన పోలీస్ శాఖనే అసహ్యించుకునే విధానంగా ఉందన్నారు. ఎస్‌ఐతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా కళాశాలలోకి ప్రవేశించి విద్యార్థులను కొట్టడం అమానుషమన్నారు.
జనసేన అంటే ఎందుకంత భయం?
జనసేన పార్టీ పేరు విన్నా, పార్టీ నినాదం విన్నా రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమర్నాథ్‌కు ఎందుకు అంత భయమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు ప్రశ్నించారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ కలెక్టర్ ఇతర జిల్లా స్థాయి అధికారుల సమక్షంలోనే మంత్రి అమర్నాథ్ విద్యార్థుల సంగతి చూడమని ఎస్సైని ఆదేశించడం ఎంతవరకు సమర్ధనీయమన్నారు. విద్యార్థులపై దాడి చేసిన ఎస్‌ఐ దివాకర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఎస్‌ఐ బహిరంగ ఎస్సై క్షమాపణ చెప్పాలన్నారు.
సిపిఐ ఎంఎల్ ఖండన
కళాశాల విద్యార్థులు తమకిష్టమైన పార్టీకి జై కొడుతుంటే మంత్రి అమర్‌నాథ్, అధికారులు, పోలీసుల సమక్షంలోనే వైసిపి గుండాలు విద్యార్థులపై దాడి చేయడం హేయమైన చర్యని సిపిఐ ఎంఎల్ నాయకులు పిఎస్ అజరు కుమార్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేపదే హక్కులు, చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్యాన్ని వల్లెవేసిన వైసిపి నాయకులు అధికార మదంతో నేడు దౌర్జన్యాలకు పూనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీస్ అధికారులు మంత్రుల మెప్పుకోసం చట్టబద్ధమైన తన అధికారాలను దుర్వినియోగం చేయరాదని హితవుపలికారు.