కడప అర్బన్ : డివైఎఫ్‌ఐ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని నిహర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో డివైఎఫ్‌ఐ నగర్ కార్యదర్శి ఓబులేసు అధ్యక్షతన జెండాను జిల్లా కార్యదర్శి శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో వారి ఆశయ సాధన కోసం అందరికీ విద్యా, అందరికీ ఉపాధి ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని కోరుతూ 1980వ సంవత్సరం నవంబర్ 1,2,3 తేదీలలో పంజాబ్ రాష్ట్రం లుధియానా నగరంలో డివైఎఫ్‌ఐని దేశ నలుమూలల నుంచి వచ్చిన ఆనాటి యువతి, యువకులు ఏర్పాటు చేశారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా పోరాడుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డివైఎఫ్‌ఐ 43 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఘనమైన చరిత్రను నిర్మించిందని తెలిపారు. అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీల పై దాడులు, దౌర్జన్యాలు పెంచారని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పన కేంద్రాలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెట్టడం ఉన్న దేశీయ చిన్న, చిన్న పరిశ్రమలు మూతపడేలాగా చేయడం వల్ల 6 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయని తెలిపారు. కేంద్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న, రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. యువతి, యువకులందరూ ఐక్యంగా పోరాడి చదువుకు తగ్గ ఉద్యోగం, యువత సామర్థ్యానికి తగ్గ ఉపాధి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్, నిరుద్యోగ రాష్ట్ర కన్వీనర్ షేక్.సిద్ధికి, నగర అధ్యక్ష, కార్యదర్శులు షాకీర్, డి.ఎం. ఓబులేసు, జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బా నరసింహులు పాల్గొన్నారు.