పరిశీలిస్తున్న నగర మేయర్
డివైడర్ల పనులు పర్యవేక్షణ
ప్రజాశక్తి-నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఏ.సి సుబ్బారెడ్డి క్రీడా మైదానం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కొండాయపాలెం గేటు కూడలి తదితర ప్రధాన మార్గాలలోని డివైడర్ల సుందరీకరణ పనులను నగర మేయర్ స్రవంతిజయవర్ధన్ బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ అభివద్ది కార్యక్రమాల్లో భాగంగా నగరవ్యాప్తంగా చేపడుతున్న సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, నగర సుందరీకరణలలో డివైడర్లు ప్రధాన భాగమని, డివైడర్లను ఆధునీకరించి అన్ని ప్రధాన మార్గాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు అనుకూలమైన మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని అధికారులకు సూచించారు. ఆర్టీసి ప్రధాన బస్టాండు కూడలి నుంచి స్థానిక కె.వి.ఆర్ పెట్రోల్ బంకు కూడలి వరకు జరుగుతున్న డివైడర్ల సుందరీకరణ పనులను తగిన నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి తేనున్నామని మేయర్ ఆకాంక్షించారు. నగరపాలక సంస్థలోని అన్ని ప్రధాన మార్గాలలో అవసరమైన చోట నూతన డివైడర్ల ఏర్పాటు, డివైడర్ల ఆధునీకీకరణ పనులు, డివైడర్ల సుందరీకరణ కార్యక్రమాలను ప్రణాళికాబద్దంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలను సిద్దం చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో 27 వ డివిజన్ కార్పొరేటర్ మురహరి, 28 వ డివిజన్ ఇంచార్జి చక్క సాయి సునీల్, 33 వ డివిజన్ ఇంచార్జి హజరత్ నాయుడు, అలహరి విజరు, మునిసిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.










