ప్రజాశక్తి - వి.కోట
మండలంలో శిలాఫలకాలు పాలకులను చూసి వెక్కిరిస్తున్నాయి.. గత పాలకులు పోయి నూతన పాలకులు వచ్చి వారి పదవీకాలమూ ముగియనుంది. నేతల మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప, నిర్మాణాలు పునాదులు దాటలేదన్న విమర్శలున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అమరనాథ్‌రెడ్డి మండల నేతల ఒత్తిడి మేరకు మండలానికి విరివిగా పనులు మంజూరు చేయించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అయితే ఎన్నికల కోడ్ అప్పట్లో అమల్లోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఆ తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే గత టిడిపి హయాంలో శంకుస్థాపనలతో తమకు సంబంధం లేదన్న విధంగా నాలుగున్నరేళ్ల పాలన గడిచింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హయాంలో ఎంఎల్‌ఎ వెంకటేగౌడ ఆ శంకుస్థాపనల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం, కొత్తగా అభివృద్ధి చేయకపోవడమూ విమర్శలకు తావిస్తోంది.
పునాదులు దాటని భవనాలు
ప్రజా అవసరాలు, అన్ని వర్గాల సౌకర్యం కోసం అభివద్ధి పనులకు గత టిడిపి హయాంలో శిలాఫలకాలు వేసి కొన్ని పనులు ప్రారంభించారు. ముఖ్యంగా దళిత వర్గాల పోరాటాల ఫలితంగా అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్థలాన్ని కేటాయించి పనులు ప్రారంభించారు. పునాదుల వరకు పనులు జరిగి అర్థాంతరంగా పనులు ఆగిపోయాయి. ఈ విషయంగా దళిత సంఘాలు పలుమార్లు నేతలను నిలదీసినా ఫలితం లేక వివిధ కారణాలతో పనులు ఆగిపోయాయి ఈ సంఘటనతో కొంతకాలంగా వివిధ దళిత సంఘాలు పలు సమావేశాలకు జాతీయ నాయకుల జన్మదిన వేడుకలు, వర్ధంతులను జరుపుకునేందుకు స్థలాలు లేక రోడ్లపైనే నిర్వహించుకునే దుస్థితి ఏర్పడింది. అంబేద్కర్ భవనం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది దళితులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అదేవిధంగా మండల పరిధిలోని వివిధ గ్రామపంచాయతీలలోని పేద, మధ్యతరగతి మైనార్టీ ల సౌకర్యం కోసం కేటాయించిన షాదీ మహల్ నిర్మాణం పనులు కూడా పునాదులకే పరిమితమయ్యాయి. దీంతో మైనార్టీలు అధికంగా ఉన్న మండలంలో, పేదల పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాల అవసరాల కోసం బయట ప్రాంతాల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయలేక అవస్థలు పడుతున్నారు. అధికారులు పాలకులు షాది మహల్ నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో నేతల తీరుపట్ల మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో చేపట్టిన మినీ స్టేడియం పనులు పునాదులకే పరిమితమయ్యాయి. పాలకులు క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని , క్రీడాకారులకు అన్ని వసతులతో కూడిన క్రీడా మైదానాలు అందుబాటులోకి తీసుకొస్తామన్న హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. మండల రైతులు పండించిన పంటలను ధరలు లేనప్పుడు నిల్వ ఉంచుకుని మంచి ధరలు వచ్చినప్పుడు అమ్ముకునే ఉద్దేశంతో గేస్తింపల్లి సమీపంలో ఐ ఆర్డి ఎఫ్ నిధులు రు.5 కోట్ల అంచనా తో చేపట్టిన శీతల గిడ్డంగి నిర్మాణం పనులు పునాదులకే పరిమితమైంది. పంటల సాగుకు లక్షల రూపాయలు పెట్టుబడును ఎరువులు కూలీల తో అవస్థలు పడుతున్న రైతులు దిగుబడుల సమయంలో ధరలు లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటి నుండి బయట పడేందుకు రైతులకు అందివచ్చిన కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం సకాలంలో అందుబాటులోకి రాకపోవడంతో మండల పరిధిలోని రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బీసీలకు పెద్దపీట వేసేది తామే అంటూ పోటీలు పడే అధికార ప్రతిపక్ష పార్టీలు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన బీసీ భవనం నిర్మాణ పనులు పూర్తి అయినప్పటికీ నిధులు విడుదల్లో జాప్యం కావడం వల్ల మిగిలిన పనులు గుత్తేదారులు పూర్తి చేయక ప్రారంభానికి నోచుకోలేకపోయింది. వీటితోపాటు గతంలో ఎన్నికలకు ముందు మండలానికి మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. దినదినానికి విద్య పరంగా దూసుకుపోతున్న వీకోట మండలం ఉన్నత చదువులకు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేక అర్ధాంతరంగా చదువులకు స్వస్తి చెబుతున్నారు. 15 కోట్ల రూపాయల అంచనాతో మంజూరైన మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో మైనార్టీ బాలికలు ఉన్నత విద్య చదువుకునేందుకు అవకాశం లేక పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి మంది బాలికలు చదువుకునే లక్ష్యంతో చేపట్టిన ఈ పాఠశాల నిర్మాణ పనులు ఆగిపోవడం పట్ల మైనార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.










