Aug 01,2021 11:07

సాగు చట్టాలు
నల్ల చట్టాలై
సాగుతున్నంత కాలం
రైతు పోరు
పట్టుసడలని పిడికిళ్లై
నినదిస్తుంటే
యావత్‌ ప్రపంచం
ఉత్కంఠగా
అటువైపే చూపుల్ని నిలిపింది

న్యాయబద్ధమైన
పోరు పురుడోసుకొన్నాక
చర్చలంటూ
సాగతీత
రైతు చరిత్రకు
మాయని మరకలా మారింది
తాడో, పేడుకు సిద్ధమై
సంఘీభావం
కొత్త రూపుని దిద్దుకుంది

బహుశా
జీర్ణ నొప్పులు తెలుసుగానీ
పంట నొప్పులు మీకేం తెలుసని ?
గడబిడ కడుపులకు
మాత్రలు తెలుసుగానీ
ఆరుగాలం శ్రమించే
రైతు యాతన్లు
మీకేం ఎరుకని ?

పోరులో ఓడినా, గెలిచినా
పౌరుషానికి పోముగానీ
మా పంటల్ని పూజిస్తూ పండిస్తాం
శ్రమ జీవుల
పోరును జూస్తూ పరిహాసమెందుకని?
ఓటుతో మీ గీతల్ని గీసిన మాకు
రాతలకు రంకులెందుకు ?

ఓ అగ్రజుల్లారా
మా రుణం తీర్చుకోడానికి
ఏపుగా పెరిగిన
మా పంట పొలాల్లో
దిష్టిబొమ్మలై
నిల్చొందురుగానీ
ఇక లెగండి...!!

మహబూబ్‌ బాషా చిల్లెం
95020 00415