ఈ కాలంలో ఎక్కడ చూసినా గుంపుగా పూసి, కనులవిందు చేసేవి డిసెంబరాలు. ఒక్క వేసవి తప్ప మిగతా కాలాల్లోనూ ఇవి కొన్ని పూలు పూస్తాయి. అయితే డిసెంబర్ నెలలో మొక్క నిండుగా పువ్వులు పూయడం ప్రారంభమవుతుంది. అకంథేసి కుటుంబానికి చెందిన మొక్కిది. దీని గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం..
డిసెంబరాలకు బోలెడన్ని స్థానిక పేర్లున్నాయి. వీటిని గొబ్బిపూలు, పెద్ద గోరింట, ముళ్ళ గోరింట, అడవి కనకాంబరాలు అనీ పిలుస్తుంటారు. వీటినే ఫిలిప్ఫైన్స్ వయొలెట్, బ్లూబెల్ బర్లేరియా అని విదేశాల్లో పిలుస్తారు. దీని శాస్త్రీయనామం బర్లేరియా క్రిస్టేటా. రెండున్నర నుంచి మూడడుగుల ఎత్తు వరకూ మొక్కలు పెరుగుతాయి. వీటి మొక్కలకు చిన్న చిన్న ముళ్లుంటాయి. ఇవి పెద్దగా నీటివనరు లేకపోయినా పెరుగుతాయి. ఎక్కువ నీళ్లు పోస్తే ఇవి చనిపోతాయి. నల్ల, ఎర్ర, ఇసుక నేలల్లోనూ ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి. గాలి ద్వారానే విత్తనాలు విస్తరించి, ఖాళీ ప్రదేశాల్లో ఈ మొక్కలు వాటంతట అవే పెరుగుతాయి.
ఒకప్పుడు ఎక్కడ చూసినా ఈ మొక్కలు ఎక్కువగా కనపడేవి. కానీ వయ్యారి భామ, బొమ్మమేడి వంటి కలుపు మొక్కల వల్ల వీటి ఉనికిని కోల్పోతున్నాయి. ఇంటి ఖాళీ స్థలాల్లో వీటిని ఎక్కువగా పెంచుతారు. డిసెంబరం పువ్వులను మాలగా కట్టుకుని, తలలో పెట్టుకుంటారు. ఇతర దేశాల్లో ఈ మొక్క భాగాలను రక్తాన్ని శుద్ధిచేసే ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. వీటిని నేలమీదా, కుండీల్లోనూ పెంచుకోవచ్చు.
లైట్ బ్లూ ఫ్లవర్స్..
డిసెంబరాలంటేనే లేత నీలం పువ్వుల మొక్కలని ప్రతీతి. వాసన రాకపోయినా చూడగానే పువ్వులు మనసు దోస్తాయి. గరాటు ఆకారంలో ఐదు రేకులతో పువ్వులు విచ్చుకుంటాయి. నేటికీ గ్రామాల్లోని స్త్రీలు వీటిని స్వయంగా కోసుకుని, మాలలు తలలో తురుముకొని మురిసిపోతుంటారు. వీటినే ఫిలిప్ఫైన్స్ వయొలెట్ అని కూడా అంటారు
ముదురు నీలం..
డిసెంబరాలు ఆధునిక రకాల్లో ముదురు నీలం రకం ఒకటి. ఇవి మబ్బు నీలిరంగుతో పువ్వులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణ డిసెంబరాలతో పోలిస్తే ఈ మొక్క కాస్త తక్కువగానే పువ్వులు పూస్తుంది. అయినా ఇవి చూడటానికి ఎంతో నయనానందంగా ఉంటాయి.
కనకాంబర పువ్వులు..
సింధూరం రంగులో తళ తళ తళుకులతో కాంతులీనే సోయగాల పూల మొక్కలే కనకాంబర డిసెంబర్ పువ్వులు. ఆకుపచ్చని ఆకులతో మొక్క చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్కల్ని కుండీల్లోనూ, నేలమీదా పెంచుకోవచ్చు. ఈ మొక్కలకు చీడా, పీడా బెడద పెద్దగా ఉండదు. ఇవి విత్తనాల నుంచి మొక్కలుగా ఉత్పత్తి అవుతాయి. వీటిని నర్సరీల్లో కుండీల్లో పెంచి అమ్ముతున్నారు.
మల్టీకలర్ ఫ్లవర్స్..
తెలుపు, నీలం రంగు చారలతో ఆధునికతతో ఆకర్షించే అపురూప పువ్వులు మల్టీకలర్ డిసెంబరాలు. వీటిని ప్రత్యేక తరహాలో ఉత్పత్తి చేసి, ప్యాక్‌చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. సాధారణ డిసెంబరాలతో పోలిస్తే ఈ మొక్కలు కాస్త పొట్టిగానే ఉంటాయి.
పింకు ఫ్లవర్స్..
పింకు రంగు పువ్వులతో ఈ మొక్క ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి చాలా తక్కువకాలం పువ్వులు పూస్తాయి. అయినా మొక్క నిండుగా గుబురుగా పూస్తాయి. ఇవి సరికొత్త హైబ్రీడ్ రకం మొక్క. వీటిని కుండీల్లో పెంచుకోవడం శ్రేయస్కరం.
శ్వేత పువ్వులు..
తెల్లని పాలమీగడ మెరుపులు చుంబించే వర్ణంలో పువ్వులు కనువిందు చేస్తాయి. కనకాంబరాలు మధ్యలో వీటిని కలుపుతూ మాల కడితే దాని శోభే వేరుగా ఉంటుంది. నల్లని కురుల్లో తెల్లని డిసెంబరాలను కలిపి, మాల కట్టి తలలో తురుముకుంటే కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. వీటిని కుండీల్లో పెంచుకోవడం సులభం.
పసుపు పువ్వులు..
పల్లెల్లో తుప్పల్లో, గట్ల మీదా విరివిగా పెరిగే పసుపురంగు గొబ్బె పువ్వులు ఈ డిసెంబరాలు. ఇవి పొదల్లా పెరిగి, పువ్వులు విచ్చుకుంటాయి. వీటికి ముళ్లు ఎక్కువగా ఉంటాయి. చాలామంది డిసెంబరాలు, గొబ్బి పూలను వేర్వేరు అను కుంటారు. కానీ ఇవి రెండూ కాస్త విభిన్న లక్షణాలతో కూడిన ఆకాంతేసియా జాతి మొక్కలే. ఈ పువ్వులు ఎంతో చూడచక్కగా ఉంటాయి. వీటినే అడవి కనకాంబరాలు అంటారు. సాధారణంగా వీటి పువ్వుల్లో ఐదు రేకుల్లో ఒక రేకు పెద్దదిగా ఉండటం వీటి ప్రత్యేకత.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506