Sep 17,2022 23:28

ఆందోలన చేస్తున్న నేతలు (ఫైల్‌)

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
విశాఖపట్నంలో కేంద్ర కార్యాలయం కలిగిన ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డిసిఐఎల్‌). దీన్ని తెగనమ్మేందుకు బిజెపి చేయని కుట్ర అంటూ లేదు. 1976లో విశాఖలో ఏర్పాటైన నుంచీ లాభాలే తప్ప నష్టాల్లేని సంస్థ డిసిఐ. కేవలం రూ.28 కోట్ల మూలధనంతో ప్రారంభించిన డిసిఐ ఆస్తులు నేడు సుమారు రూ.7 వేల కోట్లపైమాటే. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి ఇది 'బంగారు బాతు' వంటిది. కానీ బిజెపి నేతృత్వంలోని మోడీ సర్కారు దీని పీకనులమాలని చూసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ డిసిఐని 100 శాతం ప్రైవేటీకరించి తీరాలని 2016 నవంబర్‌లో నిర్ణయం చేశారు. ఆ నిర్ణయంపై సిఐటియు ఇతర కార్మిక సంఘాలన్నిటినీ ఏకం చేసి పోరాటాన్ని నెలల పాటు కొనసాగించడంతో అన్ని రాజకీయ పార్టీలు (బిజెపి మినహా) ఈ ఉద్యమానికి సహకారం అందించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెడలు వంచింది డిసిఐ పోరాటం. సంస్థను ప్రభుత్వ రంగంలో ఉంచేవరకూ, బిజెపి ప్రకటన చేసే వరకూ ఉద్యమించడం కార్మికవర్గం సాధించిన ఒక చారిత్రక విజయంగా చెప్పొచ్చు.
దేశ సేవకు అంకితమై ప్రగతి దిశగా పయనిస్తూ...
డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ భారత రక్షణ రంగం(నేవీ)కి, వైజాగ్‌ పోర్టు సహా దేశంలోని మేజర్‌, మైనర్‌ పోర్టులు, సముద్ర అధ్యయన సంస్థలు, ఫిషింగ్‌ హార్బర్‌లకు సేవలందించే భారతదేశపు ప్రధాన సంస్థగా వెలుగొందుతోంది. సముద్ర తీరం కోతకు గురికాకుండా ఒడ్డు నుంచే ఇసుకను సముద్రం లోపలకు (బీచ్‌ నౌరిష్‌మెంట్‌) పంపింగ్‌ చేసే కీలక పనులను డిసిఐ చేపడుతోంది. ప్రపంచంలోని 10 డ్రెడ్జింగ్‌ సంస్థల్లో డిసిఐ ఒకటిగా ఎదిగింది. అంతర్జాతీయంగా కూడా ఆర్డర్లు పొందుతూ డ్రెడ్జింగ్‌ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. టెండర్ల ద్వారా పలు వర్క్‌ ఆర్డర్లను సాధిస్తూ నిత్యం లాభాల బాటనే ఉంది. ఇలాంటి సంస్థను కారుచౌకగా దేశీయ కార్పొరేట్లకు కట్టబెట్టాలనే కుట్రలను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేశారు. ఎడతెరిపిలేని ఉద్యమాలతో విశాఖ నగరం 2017 సంవత్సరంలో అట్టుడికిపోయింది. డిసిఐకి చెందిన ఉద్యోగులు, అధికారులు రంగంలోకి దిగి ప్రైవేటీకరణపై పోరాడారు. సిఐటియు, సిపిఎం డిసిఐ పరిరక్షణ ఉద్యమంలో ఇతర కార్మిక, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను ఐక్యం చేస్తూ నిరంతర ఉద్యమ స్ఫూర్తిని రగిలించగలిగాయి. ఈ క్రమంలో తన ఉద్యోగంపోతే భవిష్యత్‌ అంధకారమని భయాందోళనతో విజయనగరానికి చెందిన వెంకటేష్‌ అనే డిసిఐ ఉద్యోగి రైలు కింద పడి బలవన్మరణం పాలయ్యాడు. ఈ మరణంతో 2017లో ఉద్యమం డిసిఐ రక్షణ దిశగా మరింత చైతన్యంతో అన్ని తరగతులనూ కదిలించింది. నిరవధిక ధర్నాలు, 3 రోజుల పాటు సమ్మె పోరాటాలు ఈ కాలంలో జరిగాయి.