ప్రజాశక్తి - సాలూరు : పట్టణంలో నిర్మిస్తున్న వందపడకల ఆస్పత్రిని డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ నిర్మాణ ఏజెన్సీని ఆదేశించారు. శుక్రవారం ఆయన పట్టణంలో పర్యటించారు. ఈ సందర్బంగా వందపడక ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆస్పత్రి నిర్మాణంలో నాణ్యతా లోపాల్లేకుండా చూడాలన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని నెలిపర్తి హౌసింగ్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని, మంజూరైన ప్రతి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం కావాలని, ఇందుకు లబ్ధిదారులను చైతన్యపర్చాలని అన్నారు. అప్రోచ్ రోడ్లు, నీరు, తదితర సౌకర్యాలు కల్పించామని, నిర్మాణ స్థాయిలను మార్చేందుకు సౌకర్యాలను వినియోగించుకోవాలని తెలిపారు. పేదల ఇళ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు. వచ్చే 15 రోజుల్లో గృహ నిర్మాణాల్లో ప్రగతి కనిపించాలని స్పష్టం చేశారు. సాలూరులో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనాలు, జీగిరాంలో రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని వ్యవసాయ అసిస్టెంట్‌ను ఆదేశించారు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని, అవసరమైన సాంకేతిక సలహాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ హెచ్.శంకరరావు, మున్సిపల్ సూపరింటెండెంట్ వేణుగోపాల్, గృహ నిర్మాణ సంస్థ జెఇ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










