ప్రజాశక్తి- గాజువాక : రాష్ట్రవ్యాప్తంగా 1.50లక్షల మంది లబ్ధిదారులకు డిసెంబర్ 21న టిడ్కో ఇళ్లను అందజేయాలని సిఎం జగన్మోహనరెడ్డి నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసే క్రమంలో గాజువాక జివిఎంసి జోన్ పరిధిలోని భానోజీతోట, పెదగంట్యాడ, పరవాడల్లో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను ఎపి టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ శుక్రవారం పరిశీలించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం, అక్కడ సౌకర్యాల కల్పనపై అధికారులతో జెడ్‌సి సింహాచలం, ఇతర అధికారులతో చర్చించారు.
గాజువాక జోన్ పరిధిలోని 13 ప్రాంతాల్లో 7064ఇళ్లను అక్టోబర్, డిసెంబర్ నెలల్లో లబ్ధిదారులకు పంపిణీకి అధికారులు చేపడుతున్న చర్యలపై ప్రశ్నించారు. పరవాడలో 512, అగనంపూడిలో 320ఇళ్లను ఈ నెలలోనే పంపిణీకి సిద్ధం చేస్తున్నామని ఇంజినీరింగ్ అధికారులు వివరించారు. ఆయా ప్రాంతాల్లో మిగిలిన రెండు వేల ఇళ్లతోపాటు జోన్ పరిధిలోనిమిగతా ఇళ్లను డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అందజేసేందుకు కార్యాచరణ రూపొందించి పనులు చేపడుతున్నట్లు వివరించారు.
భానోజీతోట టిడ్కో హౌసింగ్ ప్రాజెక్ట్‌కు అప్రోచ్ రోడ్ ఏర్పాటుపై జెడ్‌సితోపాటు సంబంధిత ఇఇతో చర్చించారు. జోన్‌పరిధిలోని భానోజీతోట, పరవాడ, పెదగంట్యాడల్లోని టిడ్కోగృహ సముదాయాలకు రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సౌకర్యాల కల్పన, మురుగునీటి శుద్ధి (ఎన్‌టిపి) ఏర్పాటు అంశాలపై సంబంధిత నిర్మాణ ఏజెన్సీలతోపాటు అధికారులతో సమీక్షించారు. సిఎం జగన్ నిర్ధేశించిన గడువు డిసెంబర్ 21నాటికి అన్ని సౌకర్యాలతో లబ్ధిదారులకు అందజేసేందుకు టిడ్కో ఇళ్లను సిద్ధం చేసి తీరాలని, ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని ఉపేక్షించబోమన్నారు. టిడ్కో గృహ సముదాయాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా బయో ఫెన్సింగ్ ఏర్పాటుకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులకు రుణమంజూరులో యుసిడి, టిడ్కో, ఇతర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ బొడ్డు నరసింహమూర్తి, టిడ్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ నరసింహమూర్తి, ఇఇ డి.సుధాకర్, ఇతర శాఖల అధికారులు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.










