ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : డిసెంబర్ 8, 9 తేదీల్లో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో జరగనున్న పల్నాడు బాలోత్సవాలు నిర్వహణకు సన్నాహక సమావేశం నరసరావుపేటలోని శ్రీకృష్ణ చైతన్య స్కూల్ ప్రాంగణంలో శనివారం జరిగింది. సమావేశానికి ఆక్స్‌ఫర్డ్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ రాజారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం బాధ్యులు యు.వి.రామరాజు మాట్లాడుతూ బాలల్లోని సృజనాత్మక అంశాలను వెలికి తీయటానికి బాలోత్సవాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 70 కేంద్రాల్లో బాలోత్సవాలు జరుగుతున్నాయని, వివిధ కేంద్రాల్లో జరిగిన బాలోత్సవ అనుభవాలను ఆయన వివరించారు. నరసరావుపేటలో బాలోత్సవాల నిర్వహణకు ముందుకొచ్చిన వారిని అభినందించారు. బాలోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ 8, 9 తేదీల్లో 30 రకాల అకాడమిక్, కల్చరల్ ఈవెంట్స్‌పై జిల్లా స్థాయిలో అంతర్ పాఠశాలల సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటి నిర్వహణకు ఎమ్మెస్సార్‌కె ప్రసాద్ గౌరవ అధ్యక్షులుగా, రాజారెడ్డి అధ్యక్షులుగా 60 మంది పట్టణ ప్రముఖులతో ఆహ్వాన సంఘం ఏర్పడినట్లు ప్రకటించారు. పోటీలు నిర్వహిస్తున్న 30 రకాల ఈవెంట్స్‌లోనూ సబ్ జూనియర్, జూనియర్స్, సీనియర్లకు మూడు విభాగాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ బాలోత్సవాల పిల్లల పండుగను పిఎఎన్‌సి అండ్ కెఆర్ కళాశాల ఆవరణలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. పోటీల విధివిధానాలను షేక్ మహమ్మద్ గౌస్ వివరించారు. బాలోత్సవ కమిటీ నిర్వహించదలచిన 30 రకాల ఈవెంట్లకు 30 మంది ఆర్గనైజర్లను ఈ సందర్భంగా నియమించారు. సమావేశంలో బాల ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు ఎమ్మెస్సార్‌కె ప్రసాద్, పల్నాడు విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి, తిరుమల లక్ష్మి, పద్మ, జహీర్నిశ, సుజాత, హనుమయ్య, జి.శ్రీనివాసరావు, బాజీ, అబ్దుల్ సత్తార్, డాన్స్ మాస్టర్ వెంకట్, పల్నాడు విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, మోహన్ పాల్గొన్నారు.










