ప్రజాశక్తి-ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో రైతులు సాగు చేసిన పంటలను దృష్టిలో ఉంచుకుని హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సి కెనాల్ అధికారులు డిసెంబర్ 30వ తేదీ వరకూ సాగునీరు విడుదల చేయాలని సిపిఎం మండల కన్వీనర్ విరుపాక్షి డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ, కార్మిక, కౌలు రైతుసంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ వరకూ సాగునీరు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. నియోజకవర్గ పరిధిలో లక్షలాది ఎకరాల్లో రూ.లక్షలు వెచ్చించి మిరప, పత్తి, కంది, వేరుశనగ తదితర పంటలను సాగు చేశారన్నారు. ప్రస్తుతం పంటలు పూత, కాయ దశకు చేరుకున్నాయన్నారు. ఈనేపథ్యంలో సాగునీరు బంద్ చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల ఇబ్బందులను గుర్తించి డిసెంబర్ ఆఖరు వరకూ సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు చాయాపురం రంగనాయకులు, చాబాల సుధాకర్, సిఐటియు నాయకులు సుధాకర్, హమాలీ సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
సంతకాల సేకరిస్తున్న సిపిఎం నాయకులు










