Oct 31,2023 00:09

సమావేశంలో మాట్లాడుతున్న పిన్నమనేని మురళికృష్ణ

ప్రజాశక్తి-మంగళగిరి : మంగళగిరి - తాడేపల్లి రెండో బాలోత్సవాన్ని డిసెంబర్‌ 19, 20 తేదీల్లో మంగళగిరి సమీపంలోని డాన్‌బోస్కో స్కూల్లో నిర్వహిస్తామని రాష్ట్ర బాలోత్సవ కన్వీనర్‌ పిన్నమనేని మురళీకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు సన్నాహక సమావేశం పట్టణంలోని గౌతమ్‌బుద్ధ రోడ్‌లోని ఓ హోటల్లో సోమవారం నిర్వహించారు. సమావేశానికి నిర్మల విద్యాసంస్థల డైరెక్టర్‌ వివి ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ రెండ్రోజులపాటు జరిగే బాలోత్సవాలకు వేలమంది విద్యార్థులను సమీకరించాల్సి ఉంటుందని చెప్పారు. విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకే వీటిని నిర్వహిస్తున్నామని, బాలలకు చేసే సేవ భవిష్యత్‌ తరానికి చేసే సేవ లాంటిదని అన్నారు. గతంలో బాలోత్సవాల్లో పాల్గొన్న విద్యార్థులు ప్రేరణ పొంది ఉన్నత స్థాయికి ఎదిగిన వారు కూడా ఉన్నారని గుర్తు చేశారు. విద్య మానవ విలువలను పెంచే విధంగా ఉండాలన్నారు. వివి ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ ప్రాతంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ హైస్కూల్స్‌ 35 ఉన్నాయని, వీటన్నింటి నుండి విద్యార్థులను ఉత్సవాల్లో భాగస్వామ్యం చేద్దామని చెప్పారు. సమావేశంలో మంగళగిరి - తాడేపల్లి బాలో త్సవం ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీపతిరావు, ఉపాధ్యక్షులు నన్నపనేని నాగేశ్వర రావు, కార్యదర్శి విజె విద్యాసంస్థల డైరెక్టర్‌ పి.రాజశే ఖర్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షులు ఐ.అనిల్‌ చక్రవర్తి, సీకే జూనియర్‌ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ ఎం.విజయ మోహన్‌రావు, జిఎస్‌ఆర్‌ మోహన్‌రావు, పి.ఐజాక్‌ న్యూటన్‌, బాలోత్సవం కోశాధికారి జి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.