
ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీస్ (సిఐఐ) ఆధ్వర్యాన డిసెంబర్ 12 నుంచి 16వ తేదీ వరకు బెంగళూరులో ఎక్సాన్ -2023 ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు దూసన్ బొబ్కాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంట్రీ హెడ్ ఎస్.మంజునాథ్ తెలిపారు. విజన్ 2047 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకానమీపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నగరంలోని ఫోర్ పాయింట్స్ హోటల్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ, ఎక్సాన్ ఎగ్జిబిషన్‌కు 15 దేశాల నుంచి సుమారు 80 సంస్థలు హాజరై తమ ఉత్పత్తులను, సాంకేతికతను ప్రదర్శించనున్నాయని తెలిపారు. ఆర్‌ఎస్ బిల్డర్స్ ఎగ్జిక్యూటివ్ పార్టనర్ ప్రదీప్ పాలడుగు అధ్యక్షతన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎమ్‌డి యుజెఎం.రావు మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భారతీయ రైల్వేలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు అతితక్కువ ఖర్చుతో అత్యాధునిక రవాణా సదుపాయాలు మెట్రో రైల్ అందిస్తోందన్నారు. తాము ఇప్పటికే 4 కారిడార్‌లలో 140 కిలోమీటర్లు మేర నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మొదటి కారిడార్‌లో స్టీల్‌ప్లాంట్- కొమ్మది మధ్య 34 కిలోమీటర్లు 54 స్టేషన్లతో ఉంటుందని, 2వ కారిడార్ గురుద్వారా జంక్షన్ - పాత పోస్ట్‌ఆఫీస్ మధ్య 5.07 కిలోమీటర్లు 6 స్టేషన్లతోను, 3వ కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ మధ్య 6.75 కిలోమీటర్లు 7 స్టేషన్లతో, 4వ కారిడార్ కొమ్మాది- భోగాపురం ఎయిర్‌పోర్టు మధ్య 40.67 కిలోమీటర్లు 12 స్టేషన్లతో నిర్మించనున్నామని తెలిపారు. ఈ సమీక్షలో స్కీయింగ్ స్తెట్టర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు ఇఎల్.కిరణ్‌బాబు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కె.వెంకటేశ్వర్లు, సిఐఐ విశాఖపట్నం చైర్మన్ పిపి.లాల్‌కృష్ణ, పలువురు పారిశ్రామిక వేత్తలు, సిఐఐ సభ్యులు పాల్గొన్నారు.