ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: దిశ యాప్ మీ చెంత ఉంటే మీకు రక్షణగా మీతో పోలీసులు ఉన్నట్లేనని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసులు దిశ యాప్ మెగా డ్రైవ్ నిర్వహించారు. మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ యాప్ గురించి ప్రజలకు విస్తత అవగాహన కల్పించి వారి చరవాణిలో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొనేందుకు జూన్ 14, 15 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా దిశ యాప్ మెగా డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. బాపట్ల జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, వార్డు సచివాలయం మహిళా పోలీసులు వారి పరిధిలోని గ్రామాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ముఖ్యమైన కూడళ్లు, కాలేజీలు, స్కూళ్లు, ఫ్యాక్టరీలలో దిశ యాప్ డౌన్లోడ్ వర్క్ షాప్ నిర్వహించి ప్రజలకు దిశ యాప్‌పై విస్తృత అవగాహన కల్పించి వారి చేత దిశ యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు.
ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశ యాప్‌ను మొబైల్ ఫోన్‌లో నిక్షిప్తం చేసుకున్నప్పుడే దిశ యాప్‌నకు సార్థకత చేకూరుతుంద న్నారు. దిశ యాప్‌పై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి వారి మొబైల్ ఫోన్‌లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొనేందుకు జిల్లా వ్యాప్తంగా దిశ యాప్ డౌన్లోడ్ మెగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఆపద సమయంలో పోలీసు నుంచి తక్షణ సహాయం మీరు కోరినప్పుడు, దిశ ఎస్‌ఒఎస్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళుతుందన్నారు. ఎస్‌ఒఎస్ బటన్ ప్రెస్ చెయ్యలేని స్థితిలో ఉంటే, ఫోన్ గట్టిగా అటూ ఇటూ ఊపినా, పోలీసులకు సందేశం చేరిపోతుందని తద్వారా పోలీస్‌లు వెనువెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ఒకవేళ బాధితులు ఫోన్ కాల్‌కు స్పందించని పక్షాన, ఫోన్‌లో మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నప్పుడు మాత్రమే మీ లొకేషన్ కంట్రోల్ రూమ్ ద్వారా సంబంధిత అధికారులకు చేరుతుందన్నారు. అంతేకాక దిశ యాప్‌లో 100, 112 వంటి అత్యవసర నెంబర్లతో పాటు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, ట్రామా కేర్ సెంటర్లు, మెడికల్ షాపుల వివరాలు పొందుపరచి వున్నాయని తెలిపారు. దిశ యాప్ కేవలం మహిళలకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందన్నారు. దిశ యాప్ మీ ఫోన్లో ఉంటే మీ చుట్టూ 10 మంది పోలీస్‌ల రక్షణ ఉన్నట్లేనని జిల్లా ఎస్పీ తెలిపారు.










