May 26,2023 14:53
  • డైరీ వ్యర్ధాన్ని ఇరిగేషన్ కాలువల్లో వదిలిన వైనం
  • తాము, తమ పంటలు ఎలా బతకాలని రైతులు ఆగ్రహం
  • చోద్యం చూస్తున్న అధికారులు

ప్రజాశక్తి-పుత్తూరు : పిచ్చాటూరు లోని శ్రీకాళహస్తి రోడ్డు వద్ద ఉన్న ఓ ప్రైవేటు పాల డైరీ వికృతి చేష్టలు రోజురోజుకు మితిమీరిపోతుంది. డైరీ నుండి వెలువడే వ్యర్ధాలను ఇరిగేషన్ కాలువలోకి నేరుగా వదిలేస్తున్నారు. ఈ కాలువ పిచ్చాటూరు గ్రామం నివాసాల మధ్యలో ప్రవేశించి పొలాల్లోకి ప్రవహిస్తుంది. కాలువలో ప్రవహించే నీరు పాలవలే మారే తెల్లగా తీవ్ర దుర్వాసనతో ప్రవహిస్తుంది. ఈ దుర్వాసన భరించలేకపోతున్నామని, ఈ నీరు ప్రవహిస్తే తమ పంటలు, తమ భూములు బతుకుతాయా.. అని రైతులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాత్రి వేళల్లో పాల డైరీ పూర్తి వ్యర్ధాన్ని యాజమాన్యం కాలవలో వదిలేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు చేపట్టాలని, లేకుంటే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఇకపై డైరీ వ్యర్ధనీరు కాలువలో ప్రవహిస్తే పాల డైరీ ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. తదనంతరం వచ్చే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలని వారు తెలిపారు.