Aug 22,2023 21:57

క్యాంపులో ఉన్న కదిరి అసమ్మతి కౌన్సిలర్లు

         కదిరి అర్బన్‌, టౌన్‌ : కదిరి వైసిపిలో ముసలం మొదలైంది. అధికార పార్టీలో మూడు గ్రూపులు ఎవరికి వారే అన్నట్లు రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఒకరిపైఒకరు ఎత్తుకుపైఎత్తులు వేసుకుంటున్నారు. కదిరి మున్సిపాల్టీ కేంద్రంగా వైసిపిలో రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఛైర్మన్‌ మార్పు కోరుతూ అసమ్మతి కౌన్సిలర్లు ఏకంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. గత వారం రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నా సోమవారం రాత్రి నుంచి ఇవి తీవ్ర రూపం దాల్చాయి. అధికార పార్టీ కౌన్సిలర్లు క్యాంపు రాజకీయాలకు తెరలేపి పార్టీలో చీలకదిశగా తతంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
కదిరి మున్సిపాల్టీకి సంబంధించి గత మున్సిపల్‌ ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. 36 వార్డులు ఉండగా అధికార వైసిపి గతంలో ఎన్నడూ లేనివిధంగా 31 వార్డులను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష టిడిపి 5 వార్డులను గెలుచుకుంది. దీంతో అప్పట్లో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అధ్వర్యంలో పరికి నజీమున్నీసా సాధిక్‌ను ఛైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. ఈ ఎన్నిక సమయంలో మొదటి రెండున్నర సంవత్సరాలు ఆమె ఛైర్‌పర్సన్‌గా ఉండగా మిగతా రెండున్నర సంవత్సరం మరో వ్యక్తి ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించేలా నిర్ణయం జరిగినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రస్తుత ఛైర్‌పర్సన్‌ రెండున్నర సంవత్సరాల సమయం ముగిసింది. అయినా ఆమె పదవికి రాజీనామా చేయకపోవడంతో కౌన్సిలర్లు క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. క్యాంపునకు వెళ్లిన దాదాపు 20 మంది కౌన్సిలర్లు ఏకంగా వీడియోలు విడుదల చేశారు. తాము క్యాంపులో ఉన్నామన్న విషయాన్ని వారే బహిర్గతగం చేస్తున్నారు. దీనిపై వైసిపి అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
అధికార పార్టీలో గ్రూపు విభేదాలు
గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఏమాత్రం పార్టీ కోసం పనిచేయని వ్యక్తికి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టారన్న ఆరోపణలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి. అప్పుడప్పుడు కొందరు కౌన్సిలర్లు, ఛైర్‌పర్సన్‌ మధ్య మున్సిపాల్టీలోనే వాదోపవాదాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఛైర్‌పర్సన్‌ వర్గం అసమ్మతిని పెంచిపోషించి అధికార పార్టీలో కలతలు తెచ్చే కుట్ర చేస్తున్నారనే భావనను కొందరు కౌన్సిలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛైర్‌పర్సన్‌ను మార్చాలని ఎమ్మెల్యే వద్ద కొందరు కౌన్సిలర్లు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కౌన్సిలర్లు సోమవారం రాత్రి క్యాంపు రాజకీయాలకు తెరలేపి అజ్ఞాతానికి వెళ్లారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని మార్చడానికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవి పొందడానికి చాలామంది ప్రయత్నిస్తున్నట్లు సమచారం. ఒకవేళ ఛైర్‌పర్సన్‌ పదవిని కదిలిస్తే కదిరిలో ప్రస్తుతం ఉన్న మూడు గ్రూపులు ఐదు గ్రూపులు కావడం తథ్యమని వైసిపివారే బహిరంగ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వైసిపి ముఖ్యనేతలతో చైర్‌పర్సన్‌ కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీకి పనిచేసిన వారిని పక్కన పెట్టి పిలిచి పదవి ఇచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గ్రూపులు చేయడం ఎంతవరకు సబబు అని మరో వర్గం ప్రశ్నిస్తోంది. ఛైర్‌పర్సన్‌ పదవిని ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నిస్తే మైనార్టీలకే ఇస్తారనే ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఛైర్‌పర్సన్‌ మాత్రం తాను ఎమ్మెల్యే, అధిష్టానం సూచన మేరకు నడుచుకుంటున్నానని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని తన మద్దతుదారులు వద్ద చెబుతున్నారు.
ఎమ్మెల్యే టికెట్టు రేసులో పలువురు...
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి టికెట్టును పొందేందుకు ఆశావహులు ఒక్కొక్కరిగా తెరపైకి వస్తున్నారు. అందులో భాగంగా ఆ సార్టీ వైసిపి ఎమ్మెల్యే టికెట్టు మైనార్టీలకు కేటాయిస్తారని, ఇందులో భాగంగా తమకే అవకాశం దక్కుతుందని ఆ పార్టీ మైనార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. అందులో భాగంగా వైసిపి తరపున ఓ మైనార్టీ నాయకుడు ఇటీవల తెరపైకి వచ్చాడు. తాను ఎమ్మెల్యే అభ్యర్థినంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. దీనిపై నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధి అనుచరులు తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అధికార పార్టీ నేతల మధ్య నేలకొన్న విభేదాలు భవిష్యత్తులో మరింత ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
'పురం' వైసిపిలో దుమారం
         హిందూపురం అధికార పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు దుమారం రేపుతున్నాయి. ప్రదానంగా హిందూపురం నియోజక వర్గ ఇన్‌ఛార్జి దీపిక వేణు రెడ్డికి అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ నడుమ సై అంటే సై సైగా వ్యవహరిస్తుండడం తీవ్ర చర్చినీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఛైర్‌పర్సన్‌ భర్త శ్రీనివాస్‌పై పెండింగ్‌లో ఉన్న ఓ మట్కా కేసులో పోలీసులు అరెస్టు చేయడం అధికార పార్టీలో కలకలం రేకెత్తిస్తోంది. శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురుని టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కాగ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ జాతీయ జెండాను సైతం ఎగర వేయకుండా అటు అధికారులు, ఇటు సొంత పార్టీ పాలకవర్గం సభ్యులు పావులు కదిపారు. ఆ సందర్భంలో అధికారుల తీరుపై తీవ్ర విస్మయానికి గూరైన ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ మున్సిపల్‌ కార్యాలయం నుంచి వెళ్లిపోయింది. అనంతరం మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ బలరామి రెడ్డి, ఇన్‌ఛార్జి దీపిక తదితరులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక పోతే ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ కు తాము అనుకూలమని నియోజక వర్గ ఇన్‌ఛార్జ్‌ దీపిక వేణు రెడ్డి వర్గం గత కొంత కాలంగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ భర్త శ్రీనివాస్‌ ఆరోపిస్తున్నారు. గత మున్సిపల్‌ పాలక వర్గ సమావేశ సమయంలో సొంత పార్టీకే చెందిన మెజార్టీ పాలక సభ్యుల నుంచి ఇంద్రజకు చేదు అనుభవం ఎదురైంది. ఆరు మంది వైకాపా కౌన్సిలర్లు మినహ ఆమెకు మద్దతు లేక పోవడం, టిడిపి సభ్యుల సహకారంతో సమావేశం నిర్వహించారు. ఈ తతంగాన్ని అంత దీపిక వేణు రెడ్డి వర్గంలోని కొంత మంది కౌన్సిలర్లు నడిపినట్లు వార్తులు వినపిస్తున్నాయి. గత కొంతకాలంగ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ దీపిక వర్గంలో చేరాలని ఒత్తిడిలు వస్తున్నాయి. ఆమె చేరక పోవడంతోనే అధికార పార్టీలో ముఖ్యనేతలు ఛైర్‌పర్సన్‌ భర్తను అరెస్టు చేయించినట్లు పట్టణంలో వార్తలు వినపిస్తున్నాయి. సోమవారం రాత్రి ఛైర్‌పర్సన్‌ వర్గంలో ఉండే కౌన్సిలర్లు దీపిక వర్గంలో చేరారు. అయితే వారు వైస్‌ ఛైర్మన్‌ను మార్చడంతో పాటు మరికొన్ని డిమాండ్స్‌ వారు ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్స్‌ పరిష్కరిస్తే ఛైర్‌పర్సన్‌ సైతం దీపిక వర్గంలో కలుస్తోందని వారు చెప్పినట్లు సమచారం. దీంతో పాటు మంగళవారం కొందరు పెద్దలు చర్చలు సాగిస్తున్నట్లు సమచారం. ఏదిఏమైన దాదాపు అందరు ముఖ్యనేతలతో పాటు మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్లు, కౌన్సిలర్లు దీపికకు మద్దతు పలకగా ఛైర్‌పర్సన్‌ మాత్రం సై అంటే సైసై అంటుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.