ప్రజాశక్తి -ఎస్‌ఆర్ పురం : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి నారా భువనేశ్వరి, నారా లోకేష్, చంద్రబాబు నాయుడులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు సంయుక్తంగా మంగళవారం ఎస్‌ఆర్‌పురం పోలీసు స్టేషన్‌లో సిఐ సత్తిబాబుకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ థామస్, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొన్నా యుగంధర్ మాట్లాడుతూ నారా, నందమూరి కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ్యత కాదని హితవు పలికారు. తమ నాయకుడు ఎన్‌టిఆర్ బొమ్మని పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు అంటున్నారు.. మరి మీరు వైఎస్సార్ బొమ్మ లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమా.. అని సవాల్ విసిరారు. ఫిర్యాదు చేసిన వారిలో టిడిపి మండల అధ్యక్షులు గంధమనేని జయశంకర్ నాయుడు, రాజశేఖర్ నాయుడు, బాలాజీ నాయుడు, సిద్ధయ్య శెట్టి, వేమన నాయుడు, ఆరు మండలాల టిడిపి, జనసేన నాయకులు ఉన్నారు.










